
టీడీపీ కమిటీల ద్వారా దోపిడీ
పొదలకూరు : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ కమిటీలను నియమించి కార్యకర్తలను దోచుకు తినమని ప్రోత్సహిస్తోందని....
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
పొదలకూరు : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ కమిటీలను నియమించి కార్యకర్తలను దోచుకు తినమని ప్రోత్సహిస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. పొదలకూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల స్థాయిలో పింఛన్లు, బ్యాంకురుణాలు, ఇతర ప్రభుత్వ పరమైన పథకాలు కావాలంటే టీడీపీ కార్యకర్తలతో నియమించిన కమిటీల వద్దకే వెళ్లాలన్నారు.
మండలస్థాయి అధికారులు సైతం కమిటీ సభ్యుల కనుసన్నల్లో ఉండాలంటూ మౌలిక ఆదేశాలు అందాయన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు నామమాత్రంగా మిగిలిపోయారన్నారు. ఇంత దౌర్భాగ్యమైన పాలనను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. పింఛను కావాలంటే వృద్ధుల వద్ద కొందరు కమిటీ సభ్యులు రూ.5 వేలు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి చేసిన ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమం జిల్లాలో విజయవంతమైందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదుమండలాల్లో కార్యకర్తలు, నాయకులు ధర్నా కార్యక్రమంలో పాల్గొని రైతుల పక్షాన నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
పింఛన్ రూ.1000 పెంచడం మంచిపరిణామమైనప్పటికీ అర్హులను పక్కన పెట్టడం దారుణమన్నారు. పింఛను రాని వృద్ధులు కొందరు ఆవేదనతో మృతిచెందుతున్నారని తెలిపారు. టీడీపీ పాలనలో భవిష్యత్‌లో ధనవంతుడు, దరిద్రుడు రెండే వర్గాలు ఉంటాయన్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఉండరన్నారు. పక్కాఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం సైతం ఉచితంగా ఇసుకను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
వైఎస్సార్‌సీపీ పేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో ఎంపీపీ కోనం బ్రహ్మయ్య, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, తోడేరు, విరువూరు ఎంపీటీసీ సభ్యులు ఏనుగు శశిధర్‌రెడ్డి, కొల్లి రాజగోపాల్‌రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.