‘చంద్రబాబుకి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు’ | YSRCP Leaders Serious Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు’

Feb 23 2026 12:32 PM | Updated on Feb 23 2026 12:45 PM

YSRCP Leaders Serious Comments On Chandrababu

సాక్షి, నెల్లూరు : వ్యవసాయం దండగ అనే మైండ్ సెట్‌తో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రాజెక్టుల మీద అవగాహనే లేదన్నారు. వైఎస్‌ జగన్‌కి మంచి పేరు వస్తుందనే కుట్రతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపేశారని ఆరోపించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై  వైఎ‍స్సార్‌సీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సీమతో పాటు జిల్లాకు వర ప్రదాయిని. వైఎస్‌ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే అది ఆగిపోయింది. రాబోయే రోజుల్లో రైతులతో కలిసి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఉద్యమించబోతున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీలు నీరు తెచ్చుకోగలిగితే చివరి ఆయకట్టుకు కూడా నీరు అందుతుంది.

రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ ఎత్తిపోతల పథకంపై భవిష్యత్‌లో చేయాల్సిన పోరాటాల గురించి జిల్లా నేతలతో చర్చించాం. మన నీటిని ఇతర రాష్ట్రాలు వాడుకుంటూ ఉంటే.. చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు. ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ప్రాజెక్ట్ అవసరం లేదని చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు చర్యల వల్ల ఈ ప్రాంతం ఏడాదిగా మారుతుంది. లక్షల ఎకరాలు బీడుగా మారుతాయి. రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశమై, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.

మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ..‘వ్యవసాయం దండగ అనే మైండ్ సెట్‌తో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కాకపోతే రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా కూడా ఏడారి అవ్వడం ఖాయం. కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోయి లిఫ్ట్ ఇరిగేషన్‌ను సాధిస్తాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మన గొంతులు, భూములు తడిపే ప్రాజెక్ట్. వైఎస్‌ జగన్‌కి మంచి పేరు వస్తుందనే కుట్రతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపేశారు. మార్చి ఒకటో తేదీన కడపలో ఆరు నియోజకవర్గ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తాం. చంద్రబాబుకి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement