కోడెల కేసులో కొత్త ట్విస్ట్‌.. | Sakshi
Sakshi News home page

కోడెల శివరామ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..

Published Sun, Aug 25 2019 11:45 AM

New Twist In Kodela Sivaram Laptop Theft Case - Sakshi

సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు స్వాధీనంలో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్‌ను అతని తనయుడికి చెందిన షోరూమ్‌లో గుర్తించిన ఘటన మరువక ముందే మరో దోపిడి బయటపడింది. సత్తెనపల్లి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో గతంలో అదృశ్యమైన ల్యాప్‌టాప్‌లు వెలుగులోకి వచ్చాయి. నాడు కోడెల దోపిడికి మాయమైన 29 ల్యాప్‌ట్యాపులు అనూహ్యాంగా ఆర్డీఏ ఆఫీసులో ప్రత్యక్షమయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ శివరామ్‌.. ప్రభుత్వ కార్యాలయంలోని విలువైన వస్తువులను అనుచరులకు విచ్చలవిడిగా పంచిపెట్టారు. ఈ సందర్భంలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లోని విలువైన ల్యాప్‌టాప్‌లను తన అభిమానులకు ధారాదత్తం చేశాడు. తాజాగా వాటిపై కేసు నమోదు కావడంతో తప్పించుకునేందుకు రాత్రికిరాత్రే కొత్త ల్యాప్‌టాప్‌లు కొని వాటి స్థానంలో పెట్టారు.

కాగా కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌ ఆదేశాల మేరకు కొందరు వ్యక్తులు 30 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్‌ తీసుకెళ్లారని నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్‌ బాజీబాబు సత్తెనపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంత యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2017లో సత్తెనపల్లిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి అజేష్‌చౌదరి ఆదేశాల మేరకు 30 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్‌(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)ను సత్తెనపల్లి తీసుకొచ్చి ఎన్‌ఎస్‌పీ బంగ్లాలో భద్రపరిచారు. పర్యవేక్షణ బాధ్యతలను ఎన్‌ఎస్‌పీ ఏఈగా ఉన్న ఏసమ్మకు అప్పగించారు. 2018లో కోడెల శివరామ్‌.. ల్యాప్‌టాప్‌లను, ప్రింటర్‌ను తమ వారికి అందించాలని అజేష్‌చౌదరికి సూచించగా, ఆయన ఆదేశాలతో శివరామ్‌ అనుచరులకు ఏసమ్మ అప్పగించినట్టు బాజీబాబు చెప్పారు.

ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కోడెల కుమారుడు శివరామ్‌ అధికార బలంతో కాజేశారనే ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. సంస్థ ఎండీ ఐఆర్‌టీఎస్‌ అధికారి ఆర్జా శ్రీకాంత్‌ ఆదేశాల మేరకు బాజీబాబు 16న సత్తెనపల్లి వచ్చి విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వారి ఆదేశాల మేరకు బాజీబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
 
Advertisement