సంస్కారం నేర్పబడును

New School Samskara Training Center Open In Kurnool - Sakshi

ఇక్కడ డ్రైవింగ్‌ నేర్పబడును.. క్రీడాకారులకు శిక్షణ ఇవ్వబడును.. కాంపిటీషన్‌ ఎగ్జామ్స్‌కు ఉచిత కోచింగ్‌.. ఇలాంటి ప్రకటనలు తరచూ చూస్తుంటాం.. కానీ సంస్కారం నేర్పబడును.. అని ఎక్కడా కనిపించడం కాదు కదా.. వినిపించి కూడా ఉండదు. ప్రతి ఒక్కరికీ చదువు సంస్కారం ఎంతో అవసరమనేది తెలిసిందే. ప్రస్తుతం ర్యాంకులు, గ్రేడ్‌లంటూ విద్యా సంస్థలు బట్టీ చదువులకే ప్రాధాన్యత ఇస్తున్నాయే కాని.. సభ్యత, సంస్కారం నేర్పడం ఎప్పుడో మరిచిపోయాయనే విమర్శలు ఉన్నాయి. ఒక్క మొక్క కూడా నాటకుండానే చుట్టూ పచ్చదనం కోరుకోవడం ఎంత తప్పో.. పిల్లలకు సంస్కారం నేర్పకుండా వారి నుంచి గౌరవ, మర్యాదలు ఆశించడం కూడా అంతే తప్పు అంటారు మన వీర బలవంతప్ప. అందుకే ఆయన సంస్కారం నేర్పబడును అంటూ ముందుకొచ్చారు. నేడు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం.  

సాక్షి, కర్నూల్ : పెద్ద పెద్ద చదువులు అభ్యసించి, ఉన్నత స్థానంలో విధులు నిర్వర్తిస్తున్నా.. సభ్యత, సంస్కారం లేకపోతే ప్రయోజనం లేదంటారు పెద్దలు. పెద్దలను గౌరవించడం, సంప్రదాయాలకు విలువ ఇస్తేనే సమాజం బాగుపడుతుందనేది అక్షర సత్యం. నేటి సమాజంలో కొంత మంది యువతలో సభ్యత,  సంస్కారం, సంప్రదాయాలు లేవని పెద్దలు బాధపడుతున్నారు. రోజు రోజుకు సంస్కారం, సంప్రదాయాలు పాటించే వారు తగ్గిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు కాని నేర్పిద్దామని ఆలోచించడం లేదు. ఇలాంటి తరుణంలో ఆస్పరి మండలంలో ముత్తుకూరు గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు అటు వైపు ఒక అడుగు వేశారు. విద్యార్థులకు సభ్యత – సంస్కారం నేర్పించేందుకు నడుం బిగించారు.

ఈ మేరకు సొంతంగా రూ.6 లక్షలు ఖర్చు పెట్టి ఆస్పరి సమీపంలోని రామతీర్థం క్షేత్రంలో సంస్కార శిక్షణ కేంద్రం నిర్మించారు. ఇక్కడ 6వ తరగతి నుంచి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల సెలవు రోజుల్లో సంస్కారంపై శిక్షణ ఇవ్వడంతో పాటు, భగవద్గీత, యోగాసనాలు, ఇతిహస పురాణాలు, నీతి, భక్తి శతకాల పద్యాలు నేర్పేందుకు ఏర్పాట్లు చేశారు. ఎవరు ఎటు పోతే నాకేందుకు అనుకునే వారెందరో ఉన్న ఈ రోజుల్లో  భవిష్యత్‌ తరాలు వారికి మంచి నేర్పేందుకు వీర బలవంతంప్ప ముందుకు రావడం హర్షనీయమని స్థానికులు కొని యాడుతున్నారు.  సంస్కార శిక్షణ కేంద్రం ఆదివారం ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా వీర బలవంతప్ప రచించిన శ్రీమానవ శతకం పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.  

భవిష్యత్‌ తరాలకు మంచిని నేర్పాలి 
సభ్యత, సంస్కారం, సంప్రదాయాల గురించి భవిష్యత్‌ తరాలు తెలుసుకోవాలని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశా. నా వంతుగా కొంత మందికైనా మంచి విషయాలు తెలపాలనే ప్రయత్నం ఇది. చిన్నప్పటి నుంచి పిల్లలు మంచి మార్గంలో నడవాలంటే తల్లిదండ్రులు ఇలాంటివి నేర్పించాలి. అప్పుడే యువత చెడు మార్గం పట్టదు. సంస్కారంతో పాటు ఆరోగ్యం బాగుండాలంటే యోగాసనాలు వేయాలి. ఇతిహస పురాణాలు తెలుసుకోవాలి. అందరూ భక్తి మార్గంలో నడవాలన్నదే నా ధ్యేయం.    
– వీర బలవంతప్ప,  రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top