ఉద్యోగుల ఆరోగ్య పథకంలో కొత్త వివాదం


* భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకరి తల్లిదండ్రులకే పథకం వర్తింపు

* ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌లో సర్కారు స్పష్టీకరణ.. ఉద్యోగుల అభ్యంతరం



సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం విషయంలో క్రమంగా ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య అగాధం పెరుగుతోంది. ఉద్యోగులు లేవనెత్తిన అభ్యంతరాలపై స్పష్టత ఇవ్వకుండానే పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం, కొత్తగా మరిన్ని మెలిక లు పెట్టడాన్ని ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా పరిస్థితులు ఉత్పన్నం కావటంపట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు.



భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు వారిద్దరి తల్లిదండ్రులు ఈ పథకం పరిధిలోకి రావాల్సి ఉండగా... కేవలం ఒకరి తల్లిదండ్రులకే పథకం వర్తిస్తుందన్న కొత్త మెలిక తాజాగా ఉద్యోగాల్లో ఆందోళనకు కారణమైంది. ప్రస్తుతం మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రీమియం చెల్లించే వారు తల్లిదండ్రులకు పథకం వర్తిస్తోంది. ఇదే పద్ధతిని ఉద్యోగుల ఆరోగ్య పథకంలోనూ వర్తింప చేయాలన్న ఉద్యోగుల డిమాండ్‌కు విరుద్ధంగా, ఒకరి తల్లిదండ్రులనే పథకం పరిధిలోకి తెచ్చారు. ఉద్యోగుల వివరాలను ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఇటీవల ప్రభుత్వం సూచించటంతో, ఆ కసరత్తు ప్రారంభించిన సందర్భంగా ఉద్యోగులకీ విషయం తెలిసింది.



అందులో ఒకరి తల్లిదండ్రుల వివరాలనే నమోదు చేసే పరిస్థితి ఉండటంతో ఉద్యోగులు మళ్లీ స్పష్టత కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇద్దరూ ఉద్యోగులైనప్పుడు పథకం నిబంధనల ప్రకారం ఇద్దరూ ప్రీమి యం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు చెల్లిస్తే సరిపోతుందం టూ కొన్ని రోజులక్రితం ప్రభుత్వం స్పష్టంచేసింది. ఎవరు ప్రీమియం చెల్లించారో వారి తల్లిదండ్రులకే పథకం వర్తించే వీలుందన్న సంగతి అప్పట్లో ఉద్యోగులు గ్రహించలేకపోయారు. తీరా వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్ చేసే సందర్భంలో వారికి అసలు విషయం తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులైన భార్యాభర్తలిద్దరు ప్రీమియం చెల్లించేందుకు సిద్ధమని, వారి ఇద్దరి తల్లిదండ్రులను కూడా పథకం పరిధిలోకి తేవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.



ఇప్పటికే పాత అభ్యంతరాలపై స్పష్టత రాని సమయంలో, కొత్త అభ్యంతరాలు రావటంతో పథకం కాస్తా మళ్లీ చిక్కుముడిలా మారుతోంది. 184 జీఓ, 174 జీఓల ప్రకారం చూసినా ప్రభుత్వోద్యోగులైన భార్యాభర్తలు ఇద్దరి తల్లిదంద్రులకు పథకం వర్తిం చాల్సి ఉన్నందున ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌లో పలు జిల్లాలకు చెందిన కొందరు టీచర్ల వివరాలు గల్లంతయ్యాయని, వాటిని పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top