
ప్రజల చూపు మోడీ వైపు: కిషన్‌రెడ్డి
మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
మల్కాజిగిరి: మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి బృందావన్ గార్డెన్స్‌లో గురువారం రంగారెడ్డి జిల్లా అర్బన్ కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరై కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకపోయాయని విమర్శించారు.
మోడీ దేశ ప్రధాని అయితే ఉగ్రవాదాన్ని అణిచివేయడమే కాకుండా అవినీతిరహిత పాలనను అందిస్తారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు దశ దిశ నిర్ధేశించే శక్తిగా బీజేపీ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. టీడీపీ తెలంగాణలో కనుమరుగు అవ్వడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీజీపీ బలపడుతుందని కాంగ్రెస్, మజ్లిస్, టీఆర్‌ఎస్‌లు బహిరంగంగానే చెబుతున్నాయని, ఈ విషయాన్ని పార్టీశ్రేణులే ఇంకా గుర్తించలేదన్నారు. ప్రస్తుత ఆంధ్ర రాష్ర్ట రాజకీయాల వైపు ప్రపంచ దేశాల దృష్టి సారించాయన్నారు. దేశానికి ఆశాకిరణమైన మోడీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
రంగారెడ్డి జిల్లాలో త్వరలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తామని నగర మేయర్ పదవితో పాటు అత్యధిక సీట్లు సాధించుకుంటామని తెలిపారు. రజాకారుల నుండి విముక్తి పొందడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని తెలంగాణవాసులు ఎన్నటికీ మరచిపోలేరన్నారు. గుజరాత్ నర్మద తీరంలో నిర్మించనున్న వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణానికి ప్రజల మద్దతు కూడకట్టాలని పార్టీశ్రేణులకు సూచించారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకుడు పాండు ఆధ్వర్యంలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, మీసాల చంద్రయ్య, మల్లారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, బాలలింగం, ఆర్.కె.శ్రీను, చంద్రశేఖర్, భీంరావు, మంత్రి శ్రీనివాస్, ప్రియతం రామకృష్ణ, మోహన్‌రాజ్, రాంబాబు, ఆనంద్, నర్సింహగౌడ్, ప్రభుగుప్తా, వరలక్ష్మి, స్వరూప, శైలజ తదితరులు పాల్గొన్నారు.