మామని గెలిపించి అల్లుళ్లని మడతెట్టేశారు

Nara Lokesh And Bharat Lose In Elections Balakrishna Win - Sakshi

మంగళగిరిలో లోకేష్‌ ఓటమి

విశాఖ లోక్‌సభ స్థానంలో భరత్‌ ఓటమి

ఓడిన బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్లు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ విజయం సాధించగా ఆయన ఇద్దరు అల్లుళ్లు మాత్రం ఓటమిపాలయ్యారు. చంద్రబాబు నాయుడుతో సహా.. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మంగా భావించిన మంగళగిరి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేష్‌ ఓటమి పాలవ్వడం సంచలనం రేపింది. ఆయనపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డి 5 వేల పైచీలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొంది సంచలన విజయాన్ని నమోదు చేశారు. అలాగే విశాఖపట్నం లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్‌ వైస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చేతిలో ఓటమిచెందారు. ఈ పరిణామంతో ఏపీ ఎన్నికల్లో మామ గెలిచి ఇద్దరు అల్లుడు ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. 

కాగా ఉత్కంఠ భరితంగా సాగిన మంగళగిరి అసెంబ్లీ  పోటీలో ఆర్కే విజయం సాధించి చరిత్ర సృష్టించారు. నారా లోకేష్‌ ఈ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా మంగళగిరి ఫలితం కోసం ఉత్కంఠంగా ఎదురుచూశారు. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన పోరులో లోకేష్‌ ఓటమి పాలయ్యారు. దీంతో చంద్రబాబుతో టీడీపీ శ్రేణులంతా తీవ్రంగా నిరాశ చెందారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న లోకేష్‌ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో రాజధాని ప్రాంతమైన అమరావతి నుంచి లోకేష్‌ను బరిలో నిలిపారు.

టీడీపీ తురుపుముక్కగా భావిస్తున్న లోకేష్‌ ప్రత్యక్షంగా పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే ఓటమిపాలవ్వడం ఆపార్టీ జీర్ణించుకోలేని పరిణామం. చంద్రబాబు తరువాత పార్టీ బాధ్యతలు లోకేషే చేపడతారని ఆ పార్టీలో చర్చకూడా జరిగింది. చంద్రబాబుకు వయసు మీదపడడం, లోకేష్‌ ఓడిపోవడం.. పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాగా లోకేష్‌ విజయం కోసం ఆయన భార్య బ్రాహ్మిణి, భరత్‌ గెలుపు కోసం ఆయన భార్య తేజస్విని తీవ్రంగా శ్రమించిన విషయం తెలిసిందే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top