తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు బుధవారం కలెక్టరేట్ దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించారు.
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు బుధవారం కలెక్టరేట్ దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వందలాదిగా మున్సిపల్ కార్మికులు తరలివచ్చారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎండలో బైఠాయించి నినాదాలు చేశారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.ఆంజనేయులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు 12,500 రూపాయలు జీతంగా చెల్లించాలని, వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు డబ్ల్యు. రాము మాట్లాడుతూ గత అక్టోబరులో తాము సమ్మె నోటీసు ఇవ్వగా, ఒక నెలలో సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి మహిధర్‌రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మూడు నెలలైనప్పటికీ ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు వేణుగోపాల్, సీఐటీయూ నాయకులు రవి, సుబ్బరామయ్య, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
మద్దతుగా సీపీఎం ధర్నా
మున్సిపల్ కార్మికులు, అంగన్‌వాడీ వర్కర్లు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా సీపీఎం నగరశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా జరిగింది. సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల జీతాల పెంపు విషయంలో ప్రభుత్వం నిర్దయగా ప్రవర్తించడం తగదన్నారు.