చర్చలు విఫలం.. సమ్మె యథాతథం | Municipal labor unions meetings failed | Sakshi
Sakshi News home page

చర్చలు విఫలం.. సమ్మె యథాతథం

Feb 8 2014 2:13 AM | Updated on Oct 16 2018 6:44 PM

మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో మంత్రి మహీధర్‌రెడ్డి శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

163 మున్సిపాల్టీలు, 19 కార్పొరేషన్లలో నిలిచిపోనున్న పారిశుద్ధ్యం
 సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులతో మంత్రి మహీధర్‌రెడ్డి శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రంలోని 163 మున్సిపాల్టీలు, 19 మున్సిపల్ కార్పొరేషన్లలో పారిశుద్ధ్య కార్యకలాపాలు స్తంభింప చేస్తున్నామని కార్మిక సంఘాల ప్రతినిధులు వె ల్లడించారు. సోమవారం నుంచి మంచినీరు, వీధి దీపాల కార్యక్రమాలను కూడా బహిష్కరించనున్నట్లు ప్రకటించారు. సుమారు 1.30 లక్షల మంది మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం మంత్రి మహీధర్‌రెడ్డితో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో మున్సిపల్ ఉద్యోగులు సమ్మె చేయాలనే నిర్ణయించారు. కాగా, చర్చలకు కార్మికుల సమస్యల పరిష్కారానికి డిసెంబర్‌లో నియమించిన కమిటీ చైర్మన్ (జీహెచ్‌ఎంసీ కమిషనర్), లేబర్ కమిషనర్ ప్రతినిధి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి హాజరుకాలేదు. దీంతో మంత్రి మహీధర్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
 అధికారులు చర్చలు జరిపి, ప్రతిపాదనలు పంపిస్తే.. వాటిని ఆమోదించే వ్యక్తిని తానని, అధికారులు రానందున ఇప్పుడు చర్చలు సాగించినా ప్రయోజనం లేదని, సోమవారం చర్చిద్దామంటూ మంత్రి వ్యాఖ్యానించారని కార్మిక సంఘాల ప్రతినిధులు చెప్పారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలతోపాటు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇతర కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో పాల్గొంటారని చెప్పారు. మంత్రితో చర్చలు జరిపిన వారిలో ఏఐటీయూసీ, బీఎంఎస్, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, ఇఫ్టూ, టీఆర్‌ఎస్‌కేవీ, టీఎన్‌టీయూసీ సంఘాల ప్రతినిధులు ఉన్నారు. మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల సమ్మెకు మద్దతిస్తున్నట్లు సీపీఐ, ఐఎఫ్‌టీయూ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement