28న విశాఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

MP Vijayasai Reddy Press Meet In Visakha - Sakshi

రూ.1290 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

24 కిలోమీటర్ల దూరం మానవహారం

ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడి

సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 28న విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖలో రూ.1290 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపనలు చేస్తారని వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన తర్వాత తొలిసారిగా విశాఖ వస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతగా 24 కిలోమీటర్ల దూరం మానవహారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. విశాఖ ఉత్సవ్‌లో సీఎం పాల్గొంటారని చెప్పారు.

గత ఐదు సంవత్సరాలు గా తాను విశాఖలో ఏ ప్రాపర్టీ విషయంలోనూ తాను అధికారుల పై ఒత్తిడి చేయలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకునిపోతుందని.. తన పేరు ఉపయోగించుకుని భూముల సెటిల్‌మెంట్‌ కోసం ఎవరు వచ్చినా వారిపై క్రిమినల్‌ కేసులను పెట్టాలని ఆదేశించామన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో విశాఖలో భారీ కుంభకోణం జరిగిందని..ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనే ఉద్యమాలు చేశానని చెప్పారు. విశాఖలో తనకు త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ తప్పా తనకు మరో ఆస్తి లేదన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి వెంచర్ లలో భాగస్వామ్యం పొందే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

విశాఖ ఉత్సవ్‌పై సమీక్ష...
విశాఖ ఉత్సవ్ పై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, శెట్టి పాల్గుణ, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే అదీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో 25  స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్లు..
కేవలం విద్య మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలను కల్పించాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం విశాఖలో ప్రగతి భారత్ స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ చైర్మన్‌ చల్లా మధుసూదన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మొత్తం 25 ప్రాంతాల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆలోచన అని పేర్కొన్నారు. తిరుపతి, విశాఖలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్శిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని  ఆయన తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top