ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్టు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు.
భీమవరం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్టు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం భీమవరం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉద్యమ ప్రణాళిక రూపొందించేందుకు ఈ నెల 25న విజయవాడలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. తిరుపతి, పామర్రులో యువకులు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆత్మహత్య చేసుకోవటానికి బీజేపీ, టీడీపీలే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రధాని మోడీ కాళ్లముందు పెట్టారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రైతులకు అండగా నిలిచేందుకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వారిని మోసం చేస్తున్నారన్నారు. ఆవినాష్ మావుళ్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు