దోమల దండు!

Mosquitoes In Krishna Villages - Sakshi

పంచాయతీల్లో అధ్వానంగా పారిశుద్ధ్యం

విజృంభిస్తున్న దోమలు

మంచాన పడుతున్న పల్లెలు

ఇప్పటికీ పూర్తికాని ప్రత్యేక అధికారుల నియామకం

సాక్షి, అమరావతి    బ్యూరో : గ్రామాల్లో దోమలు దండయాత్ర చేస్తున్నాయి. పంచాయతీల్లో పాలన పడకేయడంతో పారిశుద్ధ్యం మచ్చుకైనా కన్పించడం లేదు. దీంతో దోమలు విజృంభించి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లు తూతూమంత్రంగా ముగించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత మెరుగుదల, దోమల నియంత్రణకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదనే విమర్శలొచ్చాయి. కనీసం చెత్తను తొలగించే వారు లేకపోవడంతో డంపింగ్‌ పెద్ద ఎత్తున పేరుకుపోతోంది. ఓ వైపు పంచాయతీ కార్యదర్శుల కొరత, మరో వైపుప్రత్యేకాధికారుల నియామకం చేపట్టకపోవడంతో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో స్పెషల్‌ డ్రైవ్‌లు నామమాత్రంగా చేపట్టి అధికారులు చేతులు దులిపేసుకున్నారు.

పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం వరకే అధికారులు పరిమితం అయ్యారు తప్పితే... పారిశుద్ధ్యం మెరుగునకు, దోమల నియంత్రణకు చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కాల్వల్లో పూడిక తీయకపోవడంతో మురుగు పేరుకుపోయి దోమలకు నిలయంగా మారింది. చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రత తాండవిస్తున్నా ఆలకించే నాథుడే లేకుండా పోయాడు. దోమలపై యుద్ధం చేస్తున్నామని అధికారులు చేసిన ప్రకటన కేవలం కాగితాలకే పరిమితమైంది. జిల్లా వ్యాప్తంగా 973 పంచాయతీలుండగా వీటిని క్లస్టర్లుగా ఏర్పాటుచేసి 592 మంది ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే పంచాయతీల పాలనలో కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన కార్యదర్శుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.

కొరవడిన స్పష్టత...
ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంలో 2011–12లో సర్పంచుల పదవీకాలం ముగియడంతో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి పంచాయతీలను క్లస్టర్లను ప్రాతిపదికగా తీసుకుని ప్రత్యేక అధికారులను నియమించారు. రెండేళ్ల పాటు పంచాయతీల్లో అధికారుల పాలన కొనసాగింది. అప్పట్లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనపై స్పష్టత కొరవడింది. ముందుగా పీహెచ్‌సీ వైద్యులు, పశు వైద్య శాఖ అధికారులు, ఎంఈఓలను నియమించింది. తీవ్ర విమర్శలు రావడంతో వీరిని తొలగించింది.

నిధుల విడుదల ఏదీ..?
పంచాయతీల్లో పాలన కోసం 14వ ఆర్థిక సంఘం నిధులను వినియోగిస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.64 కోట్ల మేర నిధులున్నా వీటిని వినియోగించేందుకు అవకాశం లేకుండా ఉంది. ప్రత్యేక అధికారుల నియామకంతో పాటు చెక్‌ పవర్‌ను ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో వేలిముద్రలు నమోదు కావాల్సి ఉంది.

గ్రామాల్లో దోమలు స్వైర విహారం...
గ్రామాల్లో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇప్పటికే డెంగీ కేసులు నమోదై.. ప్రజలు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. మలేరియా, టైఫాయిడ్‌ విజృంభిస్తున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. పంచాయతీలో పాలనలో ఆ శాఖ మంత్రికి పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని పదవీకాలం ముగిసిన సర్పంచులు ఆరోపిస్తున్నారు.

నిధులు డ్రా చేయడానికి అవకాశం..
ఈ విషయమై డీపీఓ విక్టర్‌ను వివరణ అడగగా నిధులు డ్రా చేసుకునేందుకు ప్రత్యేక అధికారులకు అవకాశం కల్పించామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top