అవార్డులు సరే.. ప్రోత్సాహక నగదేదీ ?

Money Gift Pendings in Prathibha Awards - Sakshi

ప్రతిభావంతులకు అవార్డులిచ్చి నెలలు గడుస్తున్నా..అందని ప్రోత్సాహక నగదు

రాష్ట్రంలో 7010 మంది ప్రతిభావంతుల నిరీక్షణ

కనీసం టీఏ, డీఏలు కూడా ఖాతాలకు జమకాని వైనం

ప్రభుత్వ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం

యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రతిభా అవార్డు –2018 సంబంధించిన నగదు ప్రోత్సాహం ప్రభుత్వం ఇప్పట్లో ఇచ్చేలా లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవార్డులు ప్రదానం చేసి నాలుగు నెలలైనా నేటికి వాటి తాలూకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నగదు ప్రోత్సాహాకం మాత్రం ఇవ్వకపోవడంపై విద్యార్థుల కుటుంబాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 10 తరగతి నుంచి పీజీ వరకు వివిధ స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వారిని ప్రొత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం అందించే నగదు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతిభావంతులైన ఒక్కొక్క విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.20 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించి నాలుగు నెలలు గడిచినా నేటికీ అందివ్వలేదు. జాప్యం లేకుండా చూడాల్సిన విద్యాశాఖ మాత్రం ఇంకా విద్యార్థుల బ్యాంక్‌ ఖాతా నంబర్ల వెతుకులాట పనిలోనే ఉండటం గమనార్హం. దీంతో రాష్ట్రంలో 7010 మంది ప్రతిభవంతులకు పురస్కారం కింద లభించాల్సిన నగదు రూ.14.20 కోట్లు వారి ఖాతాల్లో జమకాలేదు. వాటితో పాటు విద్యార్థి, వారి తల్లిదండ్రులకు చెల్లించాల్సిన టీఏ, డీఏలు కూడా దక్కకపోవడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. భారత మాజీ ప్రధాని ఏపీజే అబ్ధుల్‌ కలాం జయంతి రోజునే వీటిని ఇవ్వాల్సి ఉన్నా పాలకులు, అధికారుల అలసత్వంతో నగదు వీరికి చేరడం లేదు.

రాష్ట్రంలో ప్రతిభావంతులు వీరే..
ప్రతిభా అవార్డు –2018 కింద రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశా>లలకు చెందిన 7,010 మంది విద్యార్థులను పాఠశాల విద్యశాఖ ఎంపిక చేసింది. పదో తరగతిలో 3,985 మంది, ఇంటర్‌లో 745 మంది, టెక్నికల్‌ విభాగంలో 430 మంది, డిగ్రీ, పీజీలో 311, యూనివర్సిటీలో 1,285 మందిని వివిధ కేటగిరిల కింద ఎంపికయ్యారు. వీరిలో బాలికలు 4,385 మంది, బాలురు 2,374 మంది ఉన్నారు.

జిల్లాల వారీగా...
అవార్డులు తీసుకున్న వారిలో శ్రీకాకుళం జిల్లా 356, విజయనగరం – 309, విశాఖపట్నం –486, తూర్పుగోదావరి –771, పశ్చిమగోదావరి –402, కృష్ణా –492, గుంటూరు –607, ప్రకాశం –448, నెల్లూరు –455, చిత్తూరు –682, వైఎస్సార్‌ కడప 495, అనంతపురం –756, కర్నూల్‌ – 501 మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు స్పోర్ట్‌ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 248 మందికి అవార్డులు లభించాయి.

గతేడాది అక్టోబర్‌లో అవార్డుల ప్రదానం..
ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ, పాఠశాల విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సౌత్‌ బైపాస్‌ వెనుక ఉన్న మిని స్టేడియంలో అబ్దుల్‌కలాం జయంతిని పురస్కరించుకుని గతేడాది అక్టోబర్‌ 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవార్డులు అందజేశారు. అవార్డు పొందిన విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్, గోల్డ్‌కోటెడ్‌ కాపర్‌ మెడల్, ట్యాబ్‌లను పంపిణీ చేశారు. రూ.20 వేల నగదు ప్రోత్సాహం, టీఏ, డీఏలను చెల్లించకపోవడంతో అంతా నిరాశచెందుతున్నారు. ఇప్పటికైనా నగదు ప్రోత్సాహాన్ని, టీఏ, డీఏలను త్వరితగతిన తమ ఖాతాలలో వేయాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

నగదు జమ కావాలి
ప్రతిభా అవార్డు సెలక్షన్‌ లిస్ట్‌ వచ్చిన వెంటనే విద్యార్థుల బ్యాంక్‌ ఖాతా నంబర్లను ఆ రోజే ఇచ్చేశాం. ఒక్కొక్కరి బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేశారు. ప్రస్తుతం 2 వేల మందికి నగదు జమ కావాల్సి ఉంది.
–ఆర్‌ఎస్‌ గంగాభవాని,జిల్లా విద్యాశాఖాధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top