
వైఎస్సార్ సీపీలో చేరిన ఎమ్మెల్యే రాజన్న దొర
ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పి. రాజన్నదొర కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో రాజన్నదొర తన అనుచరులతో పాటు వచ్చి పార్టీలో చేరారు. రాజన్నదొరతో పాటు సాలూరు మునిసిపాలిటీ మాజీ ఛైర్మన్ ఈశ్వరరావు, 26 మంది సర్పంచులు, ఐదుగురు మాజీ కౌన్సిలర్లు, 8 మంది మాజీ సర్పంచులు, ఇద్దరు పీఏసీఎస్ అధ్యక్షులు, ఇద్దరు మాజీ ఎంపీటీసీ సభ్యులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తరాంధ్రలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఏకపక్ష ధోరణి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకుండా విభజించాలన్న వాదనకు ఆయన ముందునుంచి మద్దతు తెలపడం వంటి వాటి పట్ల ఎప్పటినుంచో విజయనగరం జిల్లాలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
అందుకే సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కూడా ఆయన ఇంటిపై భారీ స్థాయిలో దాడి జరగడం, విజయనగరం జిల్లా చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా కొన్ని రోజుల పాటు కర్ఫ్యూ విధించడం లాంటివి కూడా చోటు చేసుకున్నాయి. దీంతో అధికార పార్టీకి చెందిన చాలామంది బొత్సపైన, కాంగ్రెస్ పార్టీ పైన విముఖత పెంచుకున్నారు. రాజన్నదొర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ జిల్లాకు చెందిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు, కురువృద్ధ నేత పెన్మత్స సాంబశివరాజు లాంటి వాళ్లంతా వైఎస్సార్సీపీలో చేరారు. సాక్షాత్తు బొత్సకు రాజకీయ గురువైన పెన్మత్స కూడా వైఎస్సార్ కాంగ్రెస్లో ఉండటంతో పలువురు నాయకులు ఇటువైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలిసింది.