
రెడ్డివారిపల్లిలో సగం నిర్మాణంలో ఉన్న ఇంటిని ప్రారంభించిన అధికారులు
అనంతపురం ,తనకల్లు: ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా ఎన్టీఆర్ ప్రభుత్వ ఇళ్లను ప్రారంభించడానికి సోమవారం మండలానికి వస్తున్నారని తెలియడంతో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వర్గం నాయకులు హడావిడిగా ఆయన రాకముందే ఇళ్లను ప్రారంభించేశారు. మండలంలోని మలిరెడ్డిపల్లిలో ఎంపీపీ భూక్యా లక్ష్మీ, తనకల్లులోని ఇందిరానగర్‌లో ఎంపీటీసీ నూర్జహాన్ చేత ఇళ్ల ప్రారంభోత్సవాలను చేయించారు. ఎమ్మెల్యే తనను ఏం అంటాడోనని భయపడిన హౌసింగ్ ఏఈ శేఖర్, ఇతర అధికారులు అప్పటికప్పడు స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో పూర్తీకాని ఇంటిని ప్రారంభోత్సవం కోసం సిద్ధం చేశారు. బయట ఇంటికి సున్నం, రంగులు వేయలేదు, ఇంటి లోపల మరుగుదొడ్లు ఇంకా నిర్మించనేలేదు. అలాగే విద్యుత్ సర్వీసింగ్ కూడా పూర్తీకాకుండా అసంపూర్ణంగా ఉంది. ఇంకా చాలా పనులు నిర్మాణ దశలోనే ఉన్నాయి.
అయినా ఇవేవీ పట్టించుకోని ఏఈ స్వయంగా ఇంటికి బయట పూలు కట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కాలువ శ్రీనివాసులు ఉన్న పోస్టర్లను అతికించి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడంతో ఎమ్మెల్యే చాంద్‌బాషా వచ్చి ఇంటికి రిబ్బన్ కటింగ్ చేసి వెళ్లిపోయారు.
కొసమెరుపు ఏంటంటే... ఎమ్మెల్యే ప్రారంభించిన ఇళ్లు టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది కాదు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ‘ ఇందిరమ్మ ఇళ్లు’ క్రింద మంజూరు చేసింది. ఈ విషయమై ఏఈకి అడిగితే ‘ఆ ఇళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన మాట వాస్తవమే. అయితే పూర్తయింది టీడీపీ ప్రభుత్వంలో కదా. కాబట్టి అది కూడా ఎన్‌టీఆర్ ప్రభుత్వ గృహం క్రిందకే వస్తుందని’ చెప్పారు. మండలంలో మొత్తం టీడీపీ ప్రభుత్వం మూడేళ్లలో 280 మంజూరు చేస్తే అందులో ఐదు ఇళ్లు మాత్రమే పైకప్పు వరకు నిర్మించుకోగా, రెండంటే రెండే ఇళ్లు పూర్తీ అయ్యాయని, అంతమాత్రం దానికి ప్రారంభోత్సవాలంటూ ఈ æహడావిడి ఎందుకంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అమడగూరు: అధికారుల తీరుతో ఎన్టీఆర్ గృహాలు మంజూరైన లబ్ధిదారులంతా నివ్వెర పోయారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకుని అన్ని మండలాల్లోనూ టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసి నూతనంగా నిర్మించుకున్న గృహాలను ప్రారంభించాల్సి ఉంది. అయితే అమడగూరు మండలంలో ఒకటి, రెండు గృహాలు మినహాయించి మిగిలినవన్నీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. అయితే సోమవారం ఉదయం గృహాల లబ్ధిదారులకు హౌసింగ్ శాఖ అధికారుల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. మీ ఇంటి దగ్గరకు వస్తున్నాం, తోరణాలు కట్టి, టెంకాయ సిద్ధంగా ఉంచాలని అధికారులు పేర్కొన్నారు. దీంతో చేసేది లేక లబ్ధిదారులు వారు చెప్పినట్లే చేశారు. అంతలోనే అధికారులు వచ్చారు. ఇంటి నిర్మాణం సగంలో ఉన్నట్లే, వారిపని కానించేశారు. ఫ్లెక్సీలు తగిలించి, హారతి పట్టి, కాయ కొట్టి, లబ్ధిదారులను నిలబెట్టి ఫోటోలు తీసుకుని వెళ్లిపోయారు. కొన్ని గ్రామాలలో సెంట్రింగ్ కూడా తొలగించకనే గృహ ప్రవేశాలను కానించేశారు. ఈ విషయంపై ఏఈ రాజేష్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా మండలంలో 85 ఇళ్లు నిర్మాణాలు పూర్తి అయ్యాయని సోమవారం 18 గృహాలకు గృహ ప్రవేశాలను చేసినట్లు తెలిపారు.