గుంటూరు జిల్లా మాచవరంలో విషాదం చోటు చేసుకుంది.
మాచవరం : గుంటూరు జిల్లా మాచవరంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా లయోలా ప్రేమ నిలయంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు చిన్నారులు శనివారం ఉదయం స్కూల్‌కు వెళ్లి తిరిగి వసతి గృహానికి చేరుకోలేదు. దీనిపై ప్రేమ నిలయం సిబ్బంది శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హెచ్‌ఐవీ సోకిన చిన్నారులకు లయోలా ప్రేమ నిలయం ఆశ్రయం కల్పిస్తోంది. అక్కడే ఉంటూ స్థానిక జెడ్పీ హైస్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు (ఒకరు అద్దంకి ప్రాంతానికి చెందిన వారు కాగా, మరొకరు పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన వారు) శనివారం సాయంత్రం అనారోగ్యంగా ఉందని ముందుగానే స్కూల్ నుంచి బయల్దేరినట్టు తెలుస్తోంది.
అయితే స్కూల్ సమీపంలో ఇటీవలే ఓ పెద్ద వ్యవసాయ బావిని తవ్వారు. అందులో చిన్నారుల మృతదేహాలు ఉన్నట్టు స్థానికులు అందించిన సమాచారంతో ఆదివారం ఉదయం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ మృతదేహాలు అదృశ్యమైన విద్యార్థులవిగా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీశారు.