అందాల పోటీలకు ఆంధ్రా అమ్మాయిలు

Miss India Auditions in Visakhapatnam - Sakshi

ఫెమినా మిస్‌ ఇండియా ఆడిషన్స్‌లో ముగ్గురు ఎంపిక

జూన్‌లో ముంబైలో గ్రాండ్‌ ఫినాలే

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): మిస్‌ ఇండియా 2019 ఆడిషన్స్‌లో దక్షిణ ప్రాంత క్రౌనింగ్‌ వేడుకలకు ఎంపికయ్యారు ముగ్గురు యువతులు. నగరంలోని ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన ఎఫ్‌బీబీ కలర్స్‌ ఫెమినా మిస్‌ ఇండియా–2019 ఆడిషన్స్‌లో ప్రతిభను కనబరిచి టాప్‌ 3గా ఎంపికయ్యారు సిమ్మాన్‌ పారిక్, సుష్మిత రాజ్, నిఖిత తన్యా. ఎఫ్‌బీబీ (ఇండియాస్‌ ఫ్యాషన్‌ హబ్‌) ఆధ్వర్యంలో సెఫోరా, రజనీగంధ పెరల్స్‌ సహకారంతో నిర్వహించిన ఈ ఆడిషన్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ నలుమూలల నుంచి సుమారు 100 మందికి పైగా అమ్మాయిలు హాజరు కాగా అందం, సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం, నడక, నడవడిక, సేవా కార్యక్రమాలు.. ఇలా విభిన్న అంశాల సమాహారంగా పలు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో రాణించి ఈ ముగ్గురూ ఎంపికయ్యారు.

24న దక్షిణ ప్రాంత క్రౌనింగ్‌ వేడుక
ఎంపికైన ఈ ముగ్గురు యువతులు ఫిబ్రవరి 24న బెంగుళూరులో నిర్వహించనున్న దక్షిణ ప్రాంత క్రౌనింగ్‌ వేడుకలకు హాజరవుతారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. వేడుక అనంతరం వారి మెంటార్‌ దియా మీర్జాను కలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అత్యంత అర్హత గల అభ్యర్థులు జూన్‌ నెలలో ముంబైలో నిర్వహించే గ్రాండ్‌ ఫినాలేలో తమతమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలియజేశారు. గ్రాండ్‌ ఫినాలేకు వెళ్లడానికి ముందు ఎంపికైన అభ్యర్థులకు నిపుణులు శిక్షణ ఇస్తారని తెలిపారు. నగరంలో నిర్వహించిన ఆడిషన్స్‌కు 2018 మిస్‌ఇండియా 2వ రన్నరప్‌ శ్రేయరావు కామవరపు, కార్‌రేసర్‌ శైలేష్‌ బొలిశెట్టి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top