మంత్రి రావెల కిశోర్‌బాబును తొలగించాలి | Minister to remove ravela kisorbabu | Sakshi
Sakshi News home page

మంత్రి రావెల కిశోర్‌బాబును తొలగించాలి

Sep 13 2015 11:34 PM | Updated on Aug 30 2019 8:37 PM

రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబును తొలగించి, గిరిజనుడికి మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర గిరిజన ఐక్యవేదిక

విశాఖపట్నం (ఎంవీపీకాలనీ) : రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబును తొలగించి, గిరిజనుడికి మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర గిరిజన ఐక్యవేదిక వ్యవస్థాపకుడు కె.వివేక వినాయక్ డిమాండ్ చేశారు. ఎంవీపీకాలనీ డబుల్‌రోడ్డులో గల గిరిజన భవనంలో ఆదివారం జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర గిరిజన ఐక్య వేదిక సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిని తొలగించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అకారణంగా శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవీంద్రబాబును తొలగించడం సరికాదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాల ఒప్పందాన్ని రద్దు చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కోరారు.

ఎపిడిమిక్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని,గిరిజన ఐక్య వేదిక అధ్యక్షురాలు ఎం.నిర్మల మాట్లాడుతూ ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించాలని, ప్రెవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈనెల 16న గుంటూరులో ముఖ్య కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు లకే చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి కొటగుల్లి సిద్ధేశ్వరరావు, గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొక్కుల రామారావు, ఆదివాసీ రిజర్వేషన్ సంరక్షణ సమితి అధ్యక్షుడు ఆర్.ఎస్.దొర, కె.రామారావు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement