జనగామ ధాన్యం కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
వారం రోజుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిందే
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ హెచ్చరిక
సాక్షి, యాదాద్రి/జనగామ/ఆత్మకూరు: రాష్ట్ర వ్యాప్తంగా మరో వారం రోజుల్లో ధాన్యం వందశాతం కొనుగోళ్లు, లిఫ్టింగ్ చేయని పక్షంలో ధాన్యాన్ని లారీల్లో లోడ్ చేసి మంత్రులు, సీఎం ఇళ్ల ముందు, అలాగే సచివాలయానికి తీసుకెళ్లి అన్‌లోడ్ చేస్తామని బీజేపీ ప్రతినిధుల బృందం హెచ్చరించింది. రైతుల పక్షాన మాట్లాడినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను సస్పెండ్ చేయడం కాదు.. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే తమను సస్పెండ్ చేసి ఎన్నికలకు వచ్చే దమ్ముందా? అని సవాల్ విసిరింది. రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ఆర్మూర్, కామారెడ్డి ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి, వెంకట్రామ్‌రెడ్డిల బృందం మంగళవారం జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధి కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ, మెప్మా ధాన్యం కొనుగోలు సెంటర్‌ను, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించింది.
అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డుతో పాటు, భువనగిరి మండలం వడపర్తిలోని ఐకేపీ కేంద్రాన్ని బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు సందర్శించారు. ఆయా కేంద్రాల్లో రైతులతో మాట్లాడి వారు పడుతున్న బాధలను తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రకటనలు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండగా, ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 45 వేల మెట్రిక్ టన్నులు మాత్రమేనని మహేశ్వర్‌రెడ్డి వివరించారు. ఈ లెక్కలు చూస్తే 80 శాతం పూర్తయిందని సీఎం చెప్పే పరిస్థితి ఏమాత్రం లేదని, 30 శాతం కొనుగోలు కూడా జరగలేదన్న వాస్తవం బయటపడుతోందన్నారు. ప్రతి కల్లెం నుంచి పోయే ధాన్యం బస్తాల్లో 10 శాతం ‘కటింగ్’పేరుతో జరుగుతున్న భారీ దోపిడీపై మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.
ఈ 10 శాతం లెక్కిస్తే మొత్తం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి అదృశ్యమవుతోందని, దాని విలువ సుమారు రూ.2 వేల160 కోట్లకు పైమాట అవుతుందని ఆయన తెలిపారు. రైతుల సమస్యలపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కల్లాల బాట పట్టడంతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. నిన్న గజ్వేల్‌కు బీజేపీ బృందం వెళ్లడంతో కలెక్టర్ స్వయంగా వచ్చి 30 లారీలను ఏర్పాటు చేశారని, ఇవాళ భువనగిరి కేంద్రానికి వస్తున్నామని తెలియగానే లారీలు వస్తున్నాయని చెప్పారు. ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ రైతుల పక్షాన మాట్లాడినందుకు కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ప్రతినిధి బృందంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నాయకులు కాసం వెంకటేశ్వర్లు, గూడూరు నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.


