
పోడూరు మండలం తూర్పుపాలెంలో బీసీ కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి పితాని తనయుడు వెంకట్(ఫైల్ ఫొటో)
పశ్చిమగోదావరి, పోడూరు: రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి పితాని సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. ఏ పదవీ లేకున్నా మంత్రి పితాని తనయుడు వెంకట్ నియోజకవర్గంలో ప్రభుత్వం తలపెట్టిన పనులకు శంకుస్థాపనలు చేసేస్తున్నారు. పోడూరు మండలం తూర్పుపాలెంలో ఇటీవలే బీసీ కమ్యునిటీ హాలు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ భవనం నిర్మాణానికి ప్రభుత్వ నిధులు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామంలో కూడా మంత్రి తనయుడు వెంకట్ ఇటీవల ఎస్సీ కమ్యునిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఏహోదా లేకుండానే..
సాధారణంగా ప్రభుత్వ నిధులతో ప్రభుత్వశాఖల పర్యవేక్షణలో చేపట్టే ఏ అభివృద్ధి పని నిర్మాణ పనులకైనా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ప్రజాప్రతినిధుల హోదాలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల హోదాలో ఉన్నవారు చేస్తారు. అయితే దీనికి భిన్నంగా కొన్నిచోట్ల మంత్రి తనయుడు శంకుస్థాపనలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. తూర్పుపాలెంలో మంత్రి తనయుడు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి పంచాయతీ కార్యదర్శి , ఐకేపీ సిబ్బంది హాజరయ్యారు.
పనులు మాత్రం పూర్తి కావడం లేదు
అలాగే 10 ఏళ్ల కిందట పెనుగొండ మండలం వెంకట్రామపురంలో కూడా ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి మంత్రి తనయుడు వెంకట్ శంకుస్థాపన నిర్వహించగా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. అప్పటి నుంచి భవన నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి పితాని దగ్గరకు తిరగడానికి దాదాపుగా రూ.25 వేలు ఖర్చయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల కమిషన్‌కుఫిర్యాదు చేసే యోచనలో ప్రతిపక్షం
మంత్రి తనయుడు వెంకట్ ఇలపర్రు, వెంకట్రామపురంలో ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించడంపై పెనుగొండ మండల వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ కన్వీనర్ బళ్ల శ్రీను(బద్రి) ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని ఇటీవల పత్రికా విలేకరుల సమావేశంలో పేర్కొన్న సంగతి విదితమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధుల చేతులమీదుగా జరగాల్సిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల మీదుగా జరపడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వంతపాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.