అమ్మ.. ఉమా!

Minister Devineni Uma Scam in Polavaram Project works - Sakshi

పోలవరం కుడి అనుసంధానం టన్నెల్‌లో మంత్రి మాయాజాలం

మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.90.01 కోట్ల నుంచి రూ.276.80 కోట్లకు పెంపు

వాటిని నోటి మాటపై బినామీకి చెందిన సూర్య కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగింత

ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తంచేయడంతో టెండర్ల నిర్వహణ

సామర్థ్యం లేని సంస్థకు రూ.290 కోట్లకు పనుల అప్పగింత

వెంటనే సబ్‌ కాంట్రాక్టు కింద బినామీకి కట్టబెట్టేసిన వైనం

రూ.50 కోట్లకుపైగా ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు

సాక్షి, అమరావతి: ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాందా? అంటే.. ఎగురుతుంది అన్నట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. 750 క్యూసెక్కుల సామర్థ్యంతో టన్నెల్‌ తవ్వలేక చేతులెత్తేసిన కాంట్రాక్టరు 17,561 క్యూసెక్కులను సరఫరా చేసే టన్నెల్‌ను తవ్వగలరా?.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారికే దన్నుగా నిలుస్తోంది. నామినేషన్‌ పద్ధతిలో బినామీకి రూ.290 కోట్ల విలువైన పనులను అస్మదీయ కాంట్రాక్టరుకు కట్టబెట్టింది. వెంటనే ఆ పనులను బినామీ చేతుల్లో పెట్టారు. పోలవరం ప్రాజెక్టు కుడి అనుసంధానం (65వ ప్యాకేజీ) పనుల్లో కమీషన్ల కోసం ఆడిన నాటకంలో రూ.50కోట్ల మేర ముడుపులు చేతులు మారినట్లు అధికారులు చెబుతున్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న ఈ బాగోతం వివరాలివీ.. 

పోలవరం జలాశయం నుంచి ఎడమ కాలువను అనుసంధానం చేస్తూ నీటిని సరఫరా చేసే పనులను (65వ ప్యాకేజీ) 2005లో రూ.103.91 కోట్లకు యూనిటి ఇన్‌ఫ్రా అనే సంస్థ దక్కించుకుంది. ఎడమ కాలువకు 17,561 క్యూసెక్కులు సరఫరా చేసేలా 919 మీటర్ల పొడవున సొరంగం తవ్వకం, హెడ్‌ రెగ్యులేటర్, ఎగ్జిట్‌ ఛానల్‌ పనులు ఈ ప్యాకేజీ కింద చేయాలి. ఇందులో రూ.13.92 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ పూర్తిచేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన యూనిటి ఇన్‌ఫ్రా సంస్థ.. ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌)లో దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. దాంతో ఏపీడీఎస్‌ఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ డీటైల్డ్‌ స్టాండర్డ్‌ స్పెసిఫికేషన్స్‌)లో 72వ నిబంధన ప్రకారం ఆ సంస్థ మీద వేటు వేయాలన్న పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ ప్రతిపాదనకు స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌సీ) ఆమోదముద్ర వేసింది. మిగిలిపోయిన రూ.90.01 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ.276.80 కోట్లకు పెంచేసేలా ఆ శాఖా మంత్రి దేవినేని చక్రం తిప్పారు. నిబంధనల ప్రకారం ఈ పనులను టెండర్లు ద్వారా కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలి.

నోటి మాటపై తన సన్నిహితుడు శ్రీనివాసరావుకు చెందిన సూర్య కన్‌స్ట్రక్షన్స్‌కు నామినేషన్‌ పద్ధతిలోదేవినేని ఉమా కట్టబెట్టేశారు. అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు అడ్డం తిరగడంతో చేసేదిలేక టెండర్లు పిలిచారు. టెండర్లలో ఎంపిక చేసిన ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే షెడ్యూలు దాఖలు చేసేలా చక్రం తిప్పారు. ఇందులో హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో ప్యాకేజీ–20 పనులను.. పాత కాంట్రాక్టర్‌పై వేటు వేసి 2015లో మ్యాక్స్‌ ఇన్‌ఫ్రాకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు. కానీ, కేవలం 200 మీటర్ల టన్నెల్‌ తవ్విన మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా ఆ తర్వాత చేతులెత్తేసింది. అదే సంస్థ పోలవరం కుడి అనుసంధానం (65వ ప్యాకేజీ) టెండర్లలో 4.76 శాతం ఎక్సెస్‌కు షెడ్యూలు దాఖలు చేసి ఎల్‌–1గా నిలిచింది. ఈ సంస్థకు పనులు కట్టబెట్టేలా కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌ (సీవోటీ)పై ఒత్తిడి తెచ్చి టెండర్‌ను ఆమోదించారు. జలవనరుల శాఖతో మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా ఒప్పందం చేసుకున్న వెంటనే ఆ పనులను సబ్‌ కాంట్రాక్టు కింద బినామీకి చెందిన సూర్య కన్‌స్ట్రక్షన్స్‌కు కట్టబెట్టేసేలా మంత్రి చక్రం తిప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top