కాంట్రాక్టర్ల కోసం కాదు..ప్రజల కోసం పనిచేస్తాం : బొత్స

Minister Botsa Sathyanarayana Held Review Meeting On Development Of Guntur - Sakshi

గుంటూరును సుందరంగా తీర్చిదిద్దుతాం

నగర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

గుంటూరులో పర్యటించిన మంత్రులు బొత్స, మోపిదేవి, ఎమ్మెల్యేలు, అధికారులు

యూజీడీ పనులపై అసంతృప్తి

వెంటనే రోడ్లను రెస్టోరేషన్‌ చేయాలని అధికారులకు బొత్స ఆదేశం

బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటన 

గుంటూరు నగరం .. చిన్నపాటి  చినుకు పడితే చాలు.. నగర వాసులు వణికిపోవాల్సిందే.. షెడ్డులోకి చేరిన బైక్‌ బయటికి రావాలంటే ముందు చక్రాలకు బురద బంధనాలు అడ్డుపడుతుంటాయి. ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు పెట్టాలంటే యూజీడీ పనులతో తవ్వేసిన గోతులు వెక్కిరిస్తుంటాయి. పిల్లలు బ్యాగులు భుజానపెట్టి స్కూల్‌కు బయలుదేరితే  అడుగడుగునా గుంతలు భయపెడుతుంటాయి. ఇవన్నీ గత టీడీపీ అస్తవ్యస్త పాలనకు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. శనివారం జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి గుంటూరులో పర్యటించిన మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వీటన్నింటినీ చూసి చలించిపోయారు. వెంటనే ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. యూజీడీ పనులను పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తామని, ఇతర అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించారు. 

సాక్షి, అమరావతి బ్యూరో/నెహ్రూనగర్‌: గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, లోపాలను సరిదిద్ది గుంటూరు నగర  సమగ్ర అభివృధ్ధే  ధ్యేయంగా పనిచేస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు మొహమ్మద్‌ ముస్తఫా, అంబటి రాంబాబు, కిలారి రోశయ్య, వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రగిరి ఏసురత్నం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లాల్‌పురం రాము, కావటి మనోహర్‌నాయుడుతో కలిసి గుంటూరు నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. ప్రధానంగా వాసవి నగర్, బీఆర్‌ స్టేడియం, యాదవ హైస్కూల్‌ రోడ్డు, సుద్దపల్లి డొంక, లాంచెస్టర్‌ రోడ్డు, పీవీకే నాయుడు మార్కెట్‌ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. యూజీడీ పనులపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుద్దపల్లి డొంకలో మానవమాత్రులు ఉండే పరిస్థితి లేదని, ఆ పరిస్థితి చూసి  నాకే బాధతో సిగ్గేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూజీడీ పనులు చేసిన చోట  రోడ్లను వెంటనే రెస్టోరేషన్‌  చేయాలని అధికారులను ఆదేశించారు. సుద్దపల్లి డొంకకు ఇరువైపులా డ్రెయిన్‌లు విస్తరణ చేసి అక్కడ పరిస్థితిని చక్కదిద్దాలని అధికారులను ఆదేశించారు.

కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదనడం అవాస్తవం
నగరంలో యూజీడీ పనులు రూ.855 కోట్లతో, 9.8 శాతం ఎక్సెస్‌ చేపట్టారని, ఇందులో కేవలం 50 శాతం పనులు పూర్తికాగా, రూ.390 కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లించామని మంత్రి బొత్స తెలియజేశారు. అంటే కాంట్రాక్టు ఏజెన్సీ  అదనంగా పెట్టిన పెట్టుబడులు ఏమీ లేవన్నారు. 80 శాతం పనులు పూర్తయ్యానని, కాంట్రాక్టు సంస్థకు బిల్లులు చెల్లించక ఆగిపోయాయంటూ చేసే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నగరంలో 457.62 కి.మీ  మేర యూజీడీ పనులు జరగగా, అందులో 156.62 కి.మీ మేర పనులు రెస్టోరేషన్‌ చేసినట్లు కాగితాల్లో ఉన్నా క్షేత్ర స్థాయిలో ఆమేరకు పనులు జరగలేదన్నారు. బీటీ, సీసీ, డబ్ల్యూబీఎం  రోడ్లు వేయాల్సి ఉందన్నారు. ఆర్‌ అండ్‌బీ  రోడ్లకు సంబంధించి 15.6 కి.మీ  మేర, రోడ్డు పనులను పునరుద్ధరించాల్సి ఉందన్నారు.

బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి...
బీఆర్‌ స్టేడియం అభివృద్ధికి సంబంధిత  మంత్రి, శాప్‌ అధికారులతో చర్చించి  కృషి చేస్తామన్నారు. స్టేడియం పక్కన ఉన్న డంపింగ్‌ యార్డును తక్షణమే తొలగించాలని ఆదేశించారు. పీవీకే కూరగాయల మార్కెట్‌కు సంబంధించి  మున్సిపల్‌ అధికారులు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు అక్కడి వ్యాపారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాంట్రాక్టుల కోసం కాకుండా, ప్రజల కోసం అవసరమైన మేరకు పనులు చేసేలా కృషి చేస్తామన్నారు. నగరంలో పరిపాలనా సౌలభ్యంకోసం  అవసరమైన గ్రామాలను విలీనం చేస్తామన్నారు. నగరంలో స్టామ్‌ వాటర్‌  డ్రైన్‌లు లేకపోవటం వలనే  ఇబ్బంది తలెత్తుతోందన్నారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నగరాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని చెప్పారు. మంత్రి మోపిదేవి వెంకట రమణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం యూజీడీ పనులను ఒక ప్రణాళిక ప్రకారం కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో చేయడం వలనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనందకుమార్‌ మాట్లాడుతూ నగరం లో రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసు కుంటు న్నట్టు తెలిపారు.  నగరంలో ప్రధానంగా ఏడు రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, నందివెలుగు రోడ్డు, పలకలూరు రోడ్డు పనులు చేస్తున్నామని మున్పిపల్‌ కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. సుద్దపల్లిడొంక, పీకలవాగు, డిస్పోజల్‌ కు చర్యలు తీసుకుంటామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో యూజీడీ పనులు చేసిన పట్టాభిపురం, అమరావతి రోడ్డులో యూజీడీ పనులకు తవ్వి, వాటిని అలాగే వదిలివేయడం వలన అవి సొరంగాల్లా తయారయ్యాయని వైఎస్సార్‌ సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం అన్నారు.

యాదవ స్కూల్‌ రోడ్డును పరిశీలిస్తున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యే ముస్తఫా, కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్, జీఎంసీ కమిషనర్‌ అనురాధ 

కాంట్రాక్టర్ల కోసం కాదు..ప్రజల కోసం పనిచేస్తాం : బొత్స
సాక్షి, అమరావతి బ్యూరో:  గుంటూరు నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, కాంట్రాక్టర్ల కోసం కాకుండా, ప్రజలకు అవసరమైన మేరకు పనులు చేస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫాతో కలిసి శనివారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం  విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   నగరంలో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా పారిశుద్ధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ నగరం విస్తరించిన దృష్ట్యా అమరావతి రోడ్డు, విజయవాడ రోడ్డు, నల్లపాడు వైపు రైతు బజారులు ఏర్పాటు చేస్తామని, అందుకనుగుణంగా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. పీవీకే నాయుడు మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ రూ.1800 కోట్లతో నగరాభివృద్ధికి ప్రత్యేక డీపీఆర్‌ తయారు చేయించినట్లు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కిలారి వెంకటరోశయ్య, గుంటూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్‌ సీపీ నాయకుడు కావటి  పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top