పాడేరుతో పాటు అనకాపల్లిలో కూడా వైద్య కళాశాల

Minister Avanti Srinivas latest Press Meet In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో డి ఎడిక్షన్ సెంటర్లు ప్రారంభించామని,  విశాఖ కేజీహెచ్‌లో కూడా డి ఎడిక్షన్ సెంటర్‌ను మొదలు పెట్టామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ శుక్రవారం తెలిపారు. విశాఖలో ఆయన మీడియతో మాట్లాడుతూ...‘ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి లక్షలాది మందికి ప్రాణదానం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కూడా లక్షలాది మందికి ఆరోగ్య శ్రీ అందిస్తున్నారు. రాష్ట్రంలో 11 లక్షల మందికి పైగా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులున్నారు. వారికి ప్రభుత్వం త్వరలోనే సేవలనందించనుంది. ఆరోగ్య శ్రీ ఒక్క ఏపీలోనే కాక చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకు కూడా వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డయాలసిస్‌ చేసుకున్న ప్రతి కిడ్నీ రోగికి ప్రభుత్వం 10 వేల రూపాయలు అందిస్తుంది. విద్య, వైద్య రంగంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. గతంలో నిర్లక్ష్యానికి గురైన 108, 104 సేవలకు తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తున్నాం. విశాఖ జిల్లాలో 41 కొత్త 108 అంబులెన్సులు, 104 కోసం 27 మొబైల్‌ టీంలు ఏర్పాటు చేశాం అని అవంతి తెలిపారు. 

('బాబు.. విగ్రహం కళ్లలోకి చూసే దండ వేశావా')

ఇంకా ఆయన మాట్లాడుతూ... ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేసి పేదవాడికి వైద్యసేవలు అందించాలన్నదే సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచన అని తెలిపారు. త్వరలోనే సీఎం జగన్‌ చేతుల మీదుగా పాడేరులో మెడికల్‌ కాలేజ్‌ శంఖుస్థాపన జరుగుతుందని అవంతి చెప్పారు. కరోనా కట్టడి కోసం సేవలందిస్తున్న పోలీసులకు, వైద్యులకు అభినందనలు తెలిపారు. విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు 31113 మందికి కరోన పరీక్షలు చేయడమైందని చెప్పారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి 80 వేల పీపీఈ కిట్లు, 49వేల ఎన్‌95 మాస్క్‌లు, 7 లక్షల 3 వేల సర్జికల్‌ మాస్క్‌లు, 2 లక్షల 40 వేల గ్లౌజ్‌లు, 436 ధర్మా మీటర్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. పాడేరుతో పాటు అనకాపల్లిలో కూడా వైద్యకళాశాల ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని, అందుకు సంబంధించిన స్థల సమీకరణ కూడా పూర్తి అయ్యిందని తెలిపారు. త్వరలోనే ఇవి కార్యరూపం దాల్చనున్నాయి అని వెల్లడించారు. (మోదీ, జగన్ మధ్య సత్సంబంధాలు: రామ్మాధవ్)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top