గుడ్డు లేకుండానే ఫుడ్డు

Midday Meal Without Eggs In West Godavari Schools - Sakshi

విద్యార్థులకు అందని పోషకాహారం

ఇదీ మధ్యాహ్న భోజనం పరిస్థితి

పుష్కర రోజులుగా ఇదే తీరు

నిర్వాహకులపై అదనపు భారం

ముందుచూపు లేని ప్రభుత్వం

బాలల ఆరోగ్యంపై మీనమేషాలు

భావి భారత పౌరుల జీవితాలతో సర్కారు చెలగాటమాడుతోంది. ప్రభుత్వపాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలకు గత పన్నెండు రోజులుగా మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు వేయడాన్ని నిలిపివేసింది. చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో మాటలు కోటలు దాటుతుంటే చేతలు మాత్రం గడప దాటడం లేదనడానికి ఇదో ఉదాహరణగా చెప్పవచ్చు.

పశ్చిమగోదావరి, ఆకివీడు: చదువుకునే పిల్లలకు అందించే ఆహారంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం లాభనష్టాల్ని బేరీజు వేస్తోంది. పట్టిసీమ, పోలవరం, రాజధాని నిర్మాణం తదితర వాటిల్లో వేల కోట్ల కమీషన్లను దోచేస్తున్న పాలకులు ఐదు రూపాయలు ఖరీదు చేసే కోడిగుడ్డు విషయంలో నష్టం వస్తుందంటూ పిల్లలకు ఆహారంలో ఇవ్వకుండా కర్కశంగా వ్యవహరిస్తోంది. విద్యార్థుల్లో పోషక విలువలు తగ్గిపోతున్నాయని, రోగాల బారిన పడుతున్నారని, సర్కారు బడుల్లో చదివే పిల్లలు దారిద్య్రరేఖకు దిగువన, పేదరికంతో ఉన్నవారే అని తెలిసినప్పటికీ వారికి పోషకాహారం అందజేయడంలో దీర్ఘాలోచనలో పడింది. గుడ్డు అందజేయడంలో తర్జన భర్జన పడుతూనే ఉంది. కోడి గుడ్ల సరఫరా నిలిచిపోవడంపై జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లావ్యాప్తంగా పాఠశాలలు విద్యార్థులు 2,73,431 మందికి గుడ్డును అందజేస్తున్నారు.

గత నెల 31వ తేదీకి గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టు రద్దు కావడంతో కొత్త కాంట్రాక్టర్‌ను నియమించలేదు. పాత కాంట్రాక్టర్‌ గుడ్డు ధర పెంచాలని కోరడంతో అందుకు ప్రభుత్వం అంగీకరించలేదని తెలిసింది. దీంతో కాంట్రాక్టర్‌ గుడ్ల సరఫరాను నిలిపివేశారు. నవంబర్‌ 1వ తేదీ నుండి మధ్యాహ్నభోజన నిర్వాహకులే గుడ్లను కొనుగోలు చేసి విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రకారంగా కొనుగోలు చేసిన గుడ్లను నిర్వాహకులు కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు భోజన సమయంలో అందజేశారు. మళ్లీవిద్యాశాఖ అధికారులు కోడిగుడ్లను ఈ నెల 10వ తేదీ నుండి కాంట్రాక్టర్‌ ద్వారా సరఫరాను పునరుద్ధరిస్తున్నామని ప్రకటించడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసి పాఠశాలల్లో ఉంచిన కోడిగుడ్ల మాటేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

కొన్ని పాఠశాలల్లో పూర్తిగా బంద్‌
గత పన్నెండు రోజులుగా కొన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయింది. నిర్వాహకులు కూడా కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులకు గుడ్డు లేకుండానే భోజనం పెడుతున్నారు. గుడ్డు సరఫరాకు ప్రభుత్వం గుడ్‌బై చెప్పినట్టుందని కొందరు ఆరోపిస్తున్నారు.

ఆ గుడ్డు ధర ఎవరిస్తారు?
కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు గుడ్డుకు రూ.5 చొప్పున ధర చెల్లించి కోడి గుడ్లను విద్యార్థులకు అందజేశారు. గత 12 రోజులుగా నిర్వాహకులు ఈ విధంగా కొనుగోలు చేసి విద్యార్థులకు సరఫరా చేసిన కోడిగుడ్ల ధరను ఎవరు చెల్లిస్తారనే దానిపై నిర్వాహకుల్లో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఇప్పటి వరకూ రూ.లక్షల విలువైన గుడ్లను నిర్వాహకులు కొనుగోలు చేసి విద్యార్థులకు సరఫరా చేశారని చెబుతున్నారు. వారం రోజుల క్రితం నిర్వాహకులే గుడ్లు సరఫరా చేస్తామని ప్రకటించడంతో నిర్వాహకులు కూడా కొనుగోలు చేయడం మానివేశారు. దీంతో పోషకాహారం అందక విద్యార్థులు ఉసూరుమంటున్నారు.

కాంట్రాక్టు కుదిరిందబ్బా
ఎట్టకేలకు ప్రభుత్వానికి, కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టరుకు ఒప్పందం కుదిరింది. దీంతో పాఠశాలలకు కోడిగుడ్లను కాంట్రాక్టరే సరఫరా చేస్తారని జిల్లా నుండి వర్తమానం అందడంతో నిర్వాహకులు బిత్తరపోతున్నారు. 12వ తేదీ వరకూ పాఠశాలలకూ గుడ్లు అందలేదని ఇంకెప్పుడు సరఫరా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

ముందుచూపు లేని ప్రభుత్వం
విద్యార్థుల పట్ల ప్రభుత్వం ముందుచూపుగా వ్యవహరించకపోవడంతో గత 12 రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో గడ్డు సరఫరా నిలిచిపోయింది. గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టు అక్టోబర్‌ 31కి పూర్తి అవుతుందని తెలిíసినప్పటికీ, పాత కాంట్రాక్టర్‌ను కొనసాగించాలా, లేక కొత్త కాంట్రాక్టర్‌ను íపిలిపించాలా అనే యోచన లేకుండా గుడ్ల సరఫరాను గాలికి వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంటాక్టు ముగిసిన తరువాత కాంట్రాక్టర్‌ను పిలిచి కొనసాగించాలని ఆదేశిస్తే ధర పెంచాలని డిమాండ్‌ చేయడంతో ప్రభుత్వం అంగీకరించలేదు. ఎట్టకేలకు అదే ధరకు అంగీకారం కుదరడంతో సరఫరాకు మార్గం ఏర్పడింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top