నాణ్యత లేని అన్నం, నీళ్ల సాంబారే గతి

 Midday Meal Scheme Delayed in Guntur - Sakshi

అధ్వానంగా మారిన మధ్యాహ్న భోజన పథకం

అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు

దుడ్డు బియ్యం తిని అనారోగ్యం పాలు  

పాఠశాలల్లో మంచి నీళ్లు లేక అవస్థలు

సక్రమంగా అందని గుడ్లు

ఏజెన్సీలకు బిల్లులు రాక ఇబ్బందులు

ప్రభుత్వ పాఠశాలలో చదివే అధిక శాతం మంది విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల గడప తొక్కలేని నిరుపేదలే. నిత్యం ఆకలి పేగులకు, అన్నం మెతుకులకు మధ్య పోరాటం చేసే అభాగ్యులే.. ఇలాంటి వారిని ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పేరిట కడుపులు మాడుస్తోంది. రేషన్‌ బియ్యం పెట్టి వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. నీళ్ల చారు, సుద్ద అన్నం, అపరిశుభ్ర వంట గదులు, చాలీచాలని ఆహారం ఇలా నాణ్యతకు పాతర వేసి ఈ అన్నం మాకొద్దు బాబోయ్‌ అనేలా విద్యార్థులకు చుక్కలు చూపిస్తోంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తే కడుపు తరుక్కుపోయే వాస్తవాలు కళ్ల వెంట నీళ్లు తెప్పించాయి.

గుంటూరు ఎడ్యుకేషన్‌: జిల్లాలో మధ్యాహ్న  భోజన పథకం అమలు ఆధ్వానంగా మారింది. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడంతో విద్యార్థులకు నాణ్యతలేని ఆహారం అందించి వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల హైకోర్టు సైతం  మధ్యాహ్న భోజనంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం సింది. పిల్లలకు అందజేసే ఆహారం జంతువులు కూడా తినవంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.  ఈ నేపథ్యంలో జిల్లాలో పలు పాఠశాలను శుక్రవారం సాక్షి విజిట్‌ చేసింది. మద్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లులు చెల్లించకపోవటంతో విద్యార్థులకు నీళ్ల చారుతో అన్నం పెడుతున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు రేషన్‌ బియ్యం (దుడ్డు) బియ్యం సరఫరా చేస్తున్నారు. పలు పాఠశాలలో మారిన అన్నం తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దుడ్డు బియ్యం అన్నం తిని కడుపు నొప్పి తెచ్చుకుంటున్నారు.  అనేక పాఠశాలల్లో గుడ్డు జాడ కనిపించడం లేదు. ప్రభుత్వ పెద్దలు కమీషన్‌ తీసుకొంటుడంతో గుడ్డు సరఫరా చేసే ఏజెన్సీలు సైతం  కుళ్లిపోయిన, పగిలిన, చిన్న గుడ్లను సరఫరా చేస్తున్నాయి. ఎక్కువ శాతం పాఠశాలల్లో వంట, స్టోర్‌ రూములు లేవు. కనీసం పాఠశాలల్లో తాగునీటి వసతి కూడా లేదు. భోజనాలు తినే చోట, వండే చోట పారిరిశుద్ధ్యం అధ్వానంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 70 శాతానికిగా పాఠశాలలో ఇలాంటి దుస్థితి నెలకొంది.  

నత్తనడకన కిచెన్‌ షెడ్ల నిర్మాణాలు
జిల్లా వ్యాప్తంగా 3,567 పాఠశాలలకు కిచెన్‌ షెడ్ల నిర్మాణం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇస్కాన్‌ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతో ఏజెన్సీల నిర్వాహకులు రోడ్డున పడనున్నారు.

మెనూ ఏదీ ?
మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఎక్కువ శాతం పాఠశాలలో మెనూ అమలు కావడం లేదు. ప్రతి రోజూ గుడ్డు ఇవ్వాల్సి ఉన్నా ఏదో ఒక రోజు ఎగనామం పెడుతున్నారు. పలు పాఠశాలల్లో పౌష్టికాహారం అందించేందుకు వీలుగా మెనూ రూపొం దించినప్పటికీ వారికి ప్రతి రోజూ నీళ్ల పప్పు, సాంబారే గతి అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం వంట ఏజెన్సీలకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, పెరుగుతున్న గ్యాస్, నిత్యావసర ధరలకు అనుగుణంగా కేటాయింపులు పెంచకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. మొత్తం మీద మధ్యాహ్న భోజనంపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటంతో పథకం మిథ్యగా మారింది.  

నెలల తరబడి పెండింగ్‌లో బిల్లులు
ఏజెన్సీలకు నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో ఏజెన్సీల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. విద్యార్థులకు భోజనం వండి పెట్టేందుకు అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో భోజనంలో నాణ్యత లోపిస్తోంది. ఇప్పటికే గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సెప్టెంబర్‌ నుంచి బిల్లులు పెండింగ్‌లో నిర్వాహకులు అప్పుల పాలవుతున్నారు. జిల్లాలో దాదాపు రూ.28 కోట్ల మేర నిర్వాహకులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top