ఇంటర్‌ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం

Mid Day Meal For Inter Students In Guntur - Sakshi

పథకం అమలుతో తీరనున్న విద్యార్థుల ఆకలి కేకలు

ప్రభుత్వ కళాశాలలకు పెరగనున్న విద్యార్థుల సంఖ్య

జూలై నుంచి అమలుకు అధికారుల కసరత్తు

సత్తెనపల్లి: ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి విద్యార్థుల వివరాలు, నిర్వహణ చర్యలతో ప్రతిపాదనలు పంపించాలని ఇంటర్మీడియెట్‌ విద్య కమిషనర్‌ ఉదయలక్ష్మి నుంచి ఆర్జేడీ, ఆర్జేడీ నుంచి కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు అందాయి.

డ్రాపౌట్స్‌ తగ్గించేందుకే..
ప్రాథమిక పాఠశాల నుంచి పదో తరగతి వరకు మథ్యాహ్న భోజన పథకం అమలవు తోంది. తద్వారా పదో తరగతి వరకు విద్యార్థులు డ్రాపౌట్లు (చదువు మానేస్తున్న వారు) ఎక్కువగా ఉండటం లేదు. పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ నడుమ డ్రాపౌట్లు ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని నివారించేందుకు ఇంటర్మీడియెట్‌ బోర్డు ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజనం అమలకు శ్రీకారం చుట్టింది. అన్నీ అనుకూలిస్తే జూలై మొదటి వారం నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలవుతుందని అధికారులు చెబుతున్నారు.

కళాశాలల్లో నిరుపేదలే.....
ఇంటర్మీడియెట్‌ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. కూలి పనులకు, వ్యవసాయ పనులకు వెళ్లే కుటుంబాల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో చేరుతున్నారు. పనులకు వెళ్లే కుటుంబాలు ఉదయం వెళితే సాయంత్రానికి తిరిగి వస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భోజనం వండి క్యారియర్లలో సర్ది పంపే పరిస్థితులు ఉండవు. దీంతో విద్యార్థులు అర్థాకలితో చదువుకునే పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు ఆకలికి తాళలేక మధ్యాహ్నం తర్వాత ఇంటి బాట పడుతున్నారు. సాయంత్రం వరకూ కళాశాలలో ఉన్నా ఆకలికి అధ్యాపకులు చెప్పే పాఠాలు విద్యార్థుల బోధపడటంలేదు. మరో వైపు పౌష్టికాహారం లోపం తలెత్తుతోంది. మధ్యాహ్న భోజనం పథకం అమలైతే విద్యార్థులకు అర్ధాకలి నుంచి బయట పడటంతో పాటు పౌíష్టికాహారం లోపాన్ని అధిగమించొచ్చని ఇంటర్మీడియెట్‌ బోర్డు ఇంటర్‌ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి ముందు కు వచ్చింది.

పాఠశాలల తరహాలో...
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఆరు రోజులు పౌíష్టికాహారంతో కూడిన భోజనాన్ని వంట ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు వడ్డిస్తున్నారు. వారంలో మూడు రోజులు కోడి గుడ్లను విద్యార్థులకు అందిస్తున్నారు. వంట ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలవుతోంది? అమలులో లోపాలున్నాయా? అనే విషయాల పై పర్యవేక్షణ చేయాలని ఇంటర్‌ కళాశాలల కమిషనర్‌ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు జరీ చేశారు.

పౌష్టికాహారంతో కూడిన భోజనం
ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. రోజూ పౌష్టికాహారంతో కూడిన భోజనం వడ్డించడంతో పాటు మజ్జిగ, అరటి పండు, గుడ్లను విద్యార్థులకు అందిస్తారు. తద్వారా హాజరు శాతం రోజూ పెరగడంతో పాటు కళాశాల ప్రవేశాలు పెరుగుతాయని ప్రిన్సిపాళ్లు భావిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలు 22, 23 ఎయిడెడ్‌ కళాశాలలు ఉన్నాయి.వీటి పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు మొదటి సంవత్సరం విద్యార్థులు 5,239 మంది ప్రవేశాలు పొందారు. మరో 1,500 మంది వరకుప్రవేశాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం 5,340 మంది విద్యార్థులు చదువుతున్నారు.

జూలై నుంచి అమలు
జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పధకం ఎలా అమల వుతోంది. వంట ఏజెన్సీలు భోజనాన్ని విద్యార్థులకు ఏ విధంగా వండి వడ్డిస్తున్నారు తదితర వాటి పై కసరత్తు జరుగుతోంది. జులై నుంచి ఇంటర్‌ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలులోకి వస్తుంది.–జెడ్‌.ఎస్‌.రామచంద్రరావు,ఆర్‌ఐఓ, గుంటూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top