కాకినాడ ఆసుపత్రిలో చావుకేక

Medicines Stopped To Kakinada General Hospital - Sakshi

ప్రతినెలా వందల సంఖ్యలో రోగుల మృత్యువాత 

అందుబాటులో లేని అత్యవసర మందులు, వైద్య పరికరాలు  

ఆరు నెలలకు కూడా సరిపోని బడ్జెట్‌ కేటాయింపులు 

బడ్జెట్‌ అయిపోయిందని సరఫరా నిలిపివేసిన ప్రభుత్వం

సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్‌)లో మరణ మృదంగం మోగుతోంది. ఈ ఏడాది జనవరిలో 615 మంది, ఫిబ్రవరిలో 531, మార్చిలో 483 మంది ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రధానంగా సెరిబ్రో వాస్క్యులర్‌ యాక్సిడెంట్‌ (మెదడులో రక్తనాళాలు చిట్లడం), హెమీప్లీజియా(పక్షవాతం)తో ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. ఇక్కడ అవసరమైన మందులు అందుబాటులో లేవు. ప్రభుత్వం మందుల సరఫరాను నిలిపివేసింది. 

అరకొర బడ్జెట్‌ 
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో 1,065 పడకలు ఉన్నాయి. రోగుల ఆక్యుపెన్సీ 2,000 నుంచి 2,500 వరకు ఉంటోంది. అంటే ఒక్కో పడకపై ఇద్దరేసి రోగులు ఉండాల్సి వస్తోంది. నిత్యం రోగులతో కిటకిటలాగే ఈ ఆసుపత్రికి మందుల కోనుగోలు కోసం ప్రభుత్వం ఏటా రూ.1.82 కోట్లు మాత్రమే కేటాయిస్తోంది. ఆ మేరకే సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ మందులను సరఫరా చేస్తోంది. కేటాయించిన రూ.1.82 కోట్లకు ఒక్కపైసా పెరిగినా మందులు సరఫరా చేయడం లేదు. ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ ఆరు నెలలకు కూడా సరిపోవడం లేదు. అత్యవసర మందులు, పరికరాలు లేక రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఆసుపత్రిలో 400 రకాల మందులు ఉండాలి. కానీ, ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రిలో కేవలం 150 రకాల మందులే ఉండడం గమనార్హం. ఇవి కొద్దిరోజుల్లో అయిపోతున్నాయి. ఆ తర్వాత పరిస్థితి ఏమిటన్నది అధికారులకే అంతుబట్టడం లేదు. అత్యవసరమైన సక్షన్‌ ఆపరేటర్స్‌ (ఊపిరితిత్తుల నుంచి నీరు తీసే పరికరం), ఆక్సిజన్‌ ప్లో మీటర్ల కొరత కూడా వేధిస్తోంది. 

మరణాలపై అధ్యయనమేదీ? 
కాకినాడ జీజీహెచ్‌లో ప్రతినెలా వందల సంఖ్యలో రోగుల మరణాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. మరణాలపై అధ్యయనం జరగడం లేదు. అనారోగ్యంతో ఈ ఆసుపత్రిలో చేరితే క్షేమంగా ఇంటిరి తిరిగివెళ్తామన్న నమ్మకం లేకుండా పోయింది. ఇక్కడ ఏం జరుగుతోందో సమీక్ష చేసే నాథుడే లేడు.

మందుల సరఫరా నిలిచిపోవడం వాస్తవమే 
అత్యవసర మందుల సరఫరా నిలిచిపోయింది. ఆసుపత్రికి కేటాయించిన బడ్జెట్‌ అయిపోవడంతో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌ మందుల సరఫరాను నిలిపివేసింది. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ మందులు అందిస్తున్నాం. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ అనుమతితో ప్రైవేట్‌ మెడికల్‌ దుకాణాల్లో మందులు కొనుగోలు చేస్తాం’’  – ఎం.రాఘవేంద్రరావు, సూపరింటెండెంట్, కాకినాడ జీజీహెచ్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top