రాజధానిలో చదరపు మీటర్‌కు లీజు రూపాయే!

Massive concessions for the construction of Mega Convention Center - Sakshi

మెగా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం కోసం భారీ రాయితీలు

డెవలపర్‌కు అత్యంత చౌకగా 20 ఎకరాలు

చదరపు మీటరుకు రూపాయి చొప్పున ఎకరాకు

ఏడాదికయ్యే లీజు రూ.4,046 మాత్రమే

తొలుత 33 ఏళ్లు.. ఆపై మరో 33 ఏళ్లు పొడిగింపు

డెవలపర్‌కు వచ్చే రెవెన్యూలో 2% సీఆర్‌డీఏకు

వాణిజ్య, ఎంటర్‌టైన్‌మెంట్, స్టార్‌ హోటల్‌ నిర్మాణం    

రెండో దశలో మరో 22 ఎకరాలు కేటాయింపు 

డెవలపర్‌కు భూమిని తాకట్టు పెట్టే హక్కు

సాక్షి, అమరావతి: రాజధానిలో రైతులకు ఇవ్వాల్సిన ల్యాండ్‌ పూలింగ్‌ ప్లాట్ల జోన్లలో కనీస మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా మెగా కన్వెన్షన్‌ కేంద్రాలు, స్టార్‌ హోటళ్లు, వాణిజ్య సముదాయాలు, వినోద (ఎంటర్‌టైన్‌మెంట్‌) సముదాయాల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటివరకు శాశ్వత సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలకు ఒక్క ఇటుక కూడా వేయని చంద్రబాబు సర్కారు ధనిక వర్గాలకు అవసరమైన లగ్జరీ నిర్మాణాలకు మాత్రం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా రాజధానిలో రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి పేరుతో మెగా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం డెవలపర్‌కు లీజు కింద అత్యంత చౌకగా భూమిని కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలి దశలో 20 ఎకరాలను లీజుకివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకుగాను చదరపు మీటరుకు ఏడాదికి  రూపాయి చొప్పున లీజును నిర్ణయించింది. అంతేకాదు.. తర్వాత రెండో దశలో మరో 22 ఎకరాలను కట్టబెట్టేందుకు కూడా సమాయత్తమైంది.

భారీ రాయితీలు..
మెగా కన్వెన్షన్‌ కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం గతంలోనే దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో టెండర్‌ ప్రక్రియను కేవలం సింగిల్‌ స్టేజ్‌లో పూర్తి చేయడంతోపాటు భారీ రాయితీతో ప్రభుత్వ కాంప్లెక్స్‌ల సమీపంలో మెగా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డెవలపర్‌కు 20 ఎకరాలను తొలిదశలో కేటాయించాలని నిర్ణయించింది. ఆ మేరకు 20 ఎకరాలను తొలుత 33 ఏళ్లపాటు లీజుకిస్తుంది. ఇందుకోసం ఏడాదికి చదరపు మీటరుకు కేవలం రూపాయి చొప్పున లీజు చెల్లిస్తే చాలు. ఆ తరువాత మరో 33 ఏళ్లపాటు లీజు పొడిగిస్తారు. ఇందుకోసం డెవలపర్‌ స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే నిబంధన విధించారు. లీజుపై ఇస్తున్నప్పటికీ ఫ్రీ హోల్డ్‌ (లీజుదారుకే సర్వహక్కులు) హక్కులను డెవలపర్‌కు కల్పిస్తారు. పీపీపీ విధానంలో డెవలపర్‌ను ఎంపిక చేస్తారు. రాజధానిలో 20 ఎకరాల్లో మెగా కన్వెన్షన్‌ సెంటర్‌తోపాటు ఎగ్జిబిషన్‌ సెంటర్, 5 స్టార్‌ హోటల్‌తోపాటు రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. తొలిదశలో కేటాయించే 20 ఎకరాల్లో కట్టే మెగా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి రూ.535 కోట్ల వ్యయమవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. ఇందులో కనీసం రెండు లక్షల చదరపు అడుగుల్లో వాణిజ్య నిర్మాణాలు వస్తాయని, దీని ద్వారా డెవలపర్‌కు వచ్చే ఆదాయంలో రెండు శాతం సీఆర్‌డీఏకు ఇవ్వాలని నిబంధన విధించారు. డెవలపర్‌ ఒప్పందం చేసుకున్న 24 నెలల్లోగా తొలి దశ మెగా కన్వెన్షన్‌ కేంద్రం పనులను పూర్తి చేయాల్సి ఉంటుందని సీఆర్‌డీఏ పేర్కొంది.

రెండో దశలో మరో 22 ఎకరాలు...
రెండో దశలో ఇదే డెవలపర్‌కు మరో 22 ఎకరాలను ఫ్రీ హోల్డ్‌ (లీజుదారుకే సర్వహక్కులు) విధానంలో ఇస్తారు. ఈ 22 ఎకరాల్లో రిటైల్, వాణిజ్యం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రెసిడెన్షియల్‌తోపాటు 3 స్టార్‌ హోటల్‌ నిర్మాణాలను డెవలపర్‌ చేపట్టనున్నారు. ఇందులో తొలిదశలో పది ఎకరాల్లో చేపట్టే నిర్మాణ ప్రాంతంలో పది శాతం నిర్మాణ ప్రాంతాన్ని, రెండో దశలో ఐదు ఎకరాల్లో చేపట్టే నిర్మాణ ప్రాంతంలో 20 శాతం నిర్మాణ ప్రాంతాన్ని, మూడో దశలో ఐదు ఎకరాల్లో చేపట్టే నిర్మాణ ప్రాంతంలో 10 శాతం నిర్మాణ ప్రాంతాన్ని సీఆర్‌డీఏకు తిరిగి ఇచ్చేయాలనే నిబంధన విధించారు. మిగతా నిర్మాణ ప్రాంతం అంతా డెవలపర్‌ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఈ విధానం వల్ల సీఆర్‌డీఏకు ఎటువంటి ఆర్థిక భారం పడదని, పైగా తొలిదశలోని 20 ఎకరాల్లో నిర్మాణాల ద్వారా డెవలపర్‌కు వచ్చే ఆదాయంలో రెండు శాతం సీఆర్‌డీఏకు వస్తుందంటూ తాజా నిర్ణయాన్ని సమర్థించుకోవడం గమనార్హం. 

ఎకరానికి ఏడాదికి లీజు రూ.4046 మాత్రమే!
తొలి దశలో కేటాయించే 20 ఎకరాల్ని చదరపు మీటరుకు ఏడాదికి రూపాయి లీజు చొప్పున కేటాయిస్తారు. ఒక ఎకరానికి 4,046 చదరపు మీటర్లు. ఆ ప్రకారం.. ఎకరానికి ఏడాదికి కేవలం రూ.4,046 లీజు అవుతుంది. సీఆర్‌డీఏ పెట్టుబడి లేనందున చౌకగా భూమిని కేటాయించనున్నట్లు అధికార వర్గాలు చెబుతుండడం గమనార్హం. భూమి ఫ్రీ హోల్డ్‌ హక్కులు కల్పిస్తున్నందున డెవలపర్‌ ఇదే భూమిని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకునే వీలుంటుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top