అంతా ఓపెన్‌

Mass Copying in Open Tenth And Inter Exams West Godavari - Sakshi

ఎగ్జామ్‌ రూంలోనే నిస్సిగ్గుగా వసూళ్లు

డబ్బులిస్తే జవాబు పత్రం అందజేత

చూసీ చూడనట్లుగా ఇన్విజిలేటర్లు

నష్టపోతున్న ప్రతిభ గల విద్యార్థులు

పాలకొల్లు సెంట్రల్‌: ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో జరుగుతున్న పదవ తరగతి, ఇంటర్మీ డియట్‌ పరీక్షలు ప్రహసనంగా మారాయి. ఈ ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షలు లంచాలతో మరీ ఓపెన్‌ అయిపోయాయని ప్రతిభ గల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్‌ స్కూల్‌ ఈ పరీక్షల నిర్వాహకులు ఇంటర్‌ విద్యార్థి నుండి రూ. 4 వేలు, పదవ తరగతి విద్యార్థి నుండి రూ.3,500 పైనే అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ పరీక్షలు నిర్వహించడానికి ఓపెన్‌ స్కూల్‌ నుండి నిధులు సమకూరుస్తారని ఓ ఉపాధ్యాయుడు తెలిపారు. కాని ఇక్కడ విద్యార్థుల నుండి సొమ్ములు వసూలు చేస్తున్నారు. ఈ పరీక్షల నిమిత్తం పాలకొల్లులో 3 సెంటర్లను కేటాయించారు. బీవీఆర్‌ఎం గరల్స్‌ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు, ఏవీఎస్‌ఎన్‌ఎం, బీఆర్‌ఎంబీ హైస్కూల్‌లో ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పరీక్షా కేంద్రాల్లో అంతా ఓపెన్‌
మే 1వ తేదీ నుంచి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కాగా ఇంటర్‌ విద్యార్థులకు 2వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3, 4 తేదీలలో జరగాల్సిన పరీక్షలను ఫొని తుఫాను కారణంగా వాయిదా వేసినట్లు విద్యార్థులు తెలిపారు. 10వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మూడు కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలకు నిర్వాహకులు తమకు అనుకూలమైన వ్యక్తులనే ఇన్విజిలేటర్లుగా నియమించుకున్నారు.

పరీక్షకు హాజరైన పదవ తరగతి విద్యార్థి నుంచి రూ.100, ఇంటర్‌ విద్యార్థి నుండి రూ.200 ఎగ్జామ్‌ రూంలోనే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు ఇచ్చిన విద్యార్థులకు ప్రశ్నపత్రంతో పాటు ఆన్సర్‌ షీటును ఇస్తున్నారు. దాంతో వాటిలోని సమాధానాలను చూసి రాస్తున్నారు. బుధవారం నుండి ఇప్పటి వరకూ జరిగిన ఈ ఓపెన్‌ పరీక్షలకు ఓ రోజు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలకు రాగా ముడుపులు అందించి మమ అనిపించారని విశ్వసనీయ సమాచారం. ఈ ఓపెన్‌ పరీక్షలు విద్యార్థుల ప్రతిభకు కొలమానంగా జరుగుతున్నట్లు లేదని వీటిని నిర్వహించే వారి జేబులు నింపుకోవడానికే జరుగుతున్నట్లు ఉందని విమర్శలు వస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top