ఏవోబీలో మావోయిస్టుల బంద్‌ ప్రశాంతం

Maoists Bandh Success In AOB Visakhapatnam - Sakshi

ఊపిరి పీల్చుకున్న గిరిజనులు

మారుమూల గ్రామాలకు నిలిచిన రవాణా

అరకు మీదుగా ఒడిశాకు నిలిచిన ఆర్టీసీ బస్‌ సర్వీసులు

పలుచోట్ల మావోయిస్టుల కరపత్రాలు

విశాఖపట్నం, అరకులోయ: ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల్లో బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఏవోబీ ప్రతినిధి జగబందు పిలుపు మేరకు మంగళవారం  జరిగిన ఏవోబీ బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి విధ్వంసకర సంఘటనలు చోటుచేసుకోక పోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మావోయిస్టుల బంద్‌ పిలుపుతో  మూడు రోజుల నుంచి పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. పాడేరు,చింతపల్లి పోలీసు సబ్‌డివిజన్ల పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించి, అదనపు  బలగాలను అందుబాటులో ఉంచారు. అలాగే అవుట్‌ పోస్టుల్లో భద్రత చర్యలను రెట్టింపు చేశా రు. మండల కేంద్రాలలో  విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బీజేపీ, టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులను కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. దీంతో గిరిజన సంక్షేమ,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్, సోమవారం రాత్రికి విశాఖ చేరుకున్నారు.  పాడే రు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ఏజెన్సీలో పర్యటనలు మానుకున్నారు.  పోలీసుల హెచ్చరికలతో అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మండల కేంద్రాలకే పరిమితమయ్యారు.

మారుమూల గ్రామాలకు నిలిచిన రవాణా
మావోయిస్టుల బంద్‌ పిలుపుతో మన్యంలోని మా రుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం నిలిచి పోయింది. విశాఖపట్నం నుంచి అరకులోయ మీ దుగా ఒడిశాకు నడిచే ఒనకఢిల్లీ, జైపూర్‌ బస్సులు మంగళవారం రద్దయ్యాయి. అరకులోయ–పాడువా రోడ్డు మీదుగా పలు ప్రైవేట్‌ వాహనాలు కూ డా నడవలేదు. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దులోని కటాఫ్‌ ఏరియా ప్రాం తాలకు జీపులు, వ్యాన్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముంచంగిపుట్టు మండల కేంద్రం నుంచి ఒడిశా ప్రాంతానికి రవాణా స్తంభించింది. పాడేరు నుంచి నడిచే డుడుమ బస్‌ను ముంచంగిపుట్టు వరకే పరిమితం చేశారు. హుకుంపేట మండలం కామయ్యపేట రోడ్డు మీదుగా ఒడిశాలోని పాడువా ప్రాంతానికి ప్రైవేట్‌ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పాడేరు నియోజకవర్గం జి.మాడుగుల మండలంలో పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి రోడ్డులో కొన్ని బస్సులు మాత్రమే తిరగాయి. నుర్మతి, మద్దిగరువు రోడ్డులో టికెట్‌  సర్వీసింగ్‌ జీపులు నిలిపివేశారు. మారుమూల గ్రామాలకు ప్రైవేటు, ఆర్టీసీ బస్సులు నడపలేదు.
ముంచంగిపుట్టు మండలంలోని ఒడిశా సరి హద్దుకు అనుకుని ఉన్న బుసిపుట్టు వారపుసంత కూడా జరగలేదు. అరకులోయ,డుంబ్రిగుడ,అనంతగిరి,హుకుంపేట మండలాల్లో దుకాణాలు తెరుచుకోగా, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో వ్యాపారులు దుకాణాలను ఉదయం 11 గంటల వరకు మూసివేసినప్పటికీ పోలీసులు రంగప్రవేశం చేసి, దుకాణాలను తెరిపించారు.

మారుమూల ప్రాంతాల్లో కరపత్రాలు
ముంచంగిపుట్టు మండలంలోని కుమడ జంక్షన్‌ నుంచి ఒడిశాలోని బెజ్జంగి పోయే రోడ్డుతోపాటు, లక్ష్మీపురం రోడ్డులో, నిత్యం నిఘా నిడాలో ఉండే  చింతపల్లి మండల కేంద్రంలో మెట్టబంగ్లాకు సమీ పంలోని సాయిబాబా ఆలయం దగ్గర మావోయిస్టుల కరపత్రాలు అతికించారు.  బంద్‌ను విజయవతం చేయాలని, బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసించాలనే నినాదాలు ఈ కరపత్రాలలో ఉన్నట్టు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top