అధికారం మనదే..తవ్వేద్దాం.. | Sakshi
Sakshi News home page

అధికారం మనదే..తవ్వేద్దాం..

Published Fri, Nov 28 2014 1:52 AM

అధికారం మనదే..తవ్వేద్దాం.. - Sakshi

నెల్లూరు (అర్బన్/బారకాసు) : జిల్లాలో ఇసుక రవాణా నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. అధికారం అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతూ ఇసుక వ్యాపారంతో రెండు చేతులా ఆర్జిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు అధికారులు చేపడుతున్న చర్యలు నామమాత్రమవుతున్నాయి.  పెన్నా, స్వర్ణముఖి, కాళంగి నదులతో పాటు పలు వాగుల్లో ఇసుక తవ్వకాలు, విక్రయ బాధ్యతలను ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు అప్పగించిన విషయం తెలిసిందే.

మొదట జిల్లా వ్యాప్తంగా 80 రీచ్‌లను గుర్తించగా వాటిలో 50 రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలు జరపాలని నిర్ణయించారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఆరు రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. కానీ టీడీపీ నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి 38 రీచ్‌ల్లో ఇసుక విక్రయాలు జరుపుతున్నారు.

 నిబంధనలకు నీళ్లు
 ఇసుక తవ్వకాల్లో టీడీపీ నేతల జోక్యం అధికమైంది. మహిళా సమాఖ్యలకు బదులు నేతలే తమ అనుచరులతో ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెడతామని అధికారులు మొదట్లో ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఇలా జరగలేదు. ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యే ఇసుక తవ్వకాలు జరపాలని ఆదేశించారు.

అధికార పార్టీ నేతలు ఇవేమీ పట్టనట్లు రాత్రి వేళలోనూ ఇసుకను తవ్వి డంప్ చేస్తున్నారు.ట్రాక్టర్లకు జీపీఎస్ విధానం అమర్చి అవి ఎక్కడ తిరుగుతున్నాయో గుర్తిస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఒక్క ట్రాక్టర్‌కు జీపీఎస్‌ను అమర్చిన దాఖలాలు లేవు. ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇసుకను రవాణా చేయాలని సూచిం చారు. నేతలు లారీల ద్వారా కూడా రవాణా చేసేస్తున్నారు.

 అధికారం అండగా..
 అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా అడిగే వాళ్లు ఉండరనే కోణంలో టీడీపీ నేతలు ఇసుక తవ్వకాల విషయంలో వ్యవహరిస్తున్నారు. మహిళా సమాఖ్యలకు అప్పగించిన బాధ్యతలను తాము తీసుకుని దర్జాగా తవ్వుకుంటున్నారు. ఒక వే బిల్లుతోనే పది లోడ్లను తోలుకుంటున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఈ వ్యవహారమై మరీ దుమారం రేగడంతో మంగళవారం కలిగిరి ప్రాంతంలో నాలుగు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. అదే రోజు కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు.

 అంతా గందరగోళం
 ఇసుక రవాణా విషయంలో గందరగోళం నెలకొంది. ఎడ్లబండ్లకు ఉచితంగా ఇసుక రవాణా చేసుకునే అవకాశం కల్పించాలని వాటి యజమానులు కోరుతున్నారు. వీరు ఒక ట్రిప్పు ఇసుక తోలుకోవాలంటే రూ.650 చెల్లించాలని అధికారులు నిబంధనను పెట్టారు. దీనిపై నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేశారు.

కొన్ని చోట్ల గ్రామస్తులు తవ్వకాలు జరపకూడదంటూ నిరసనలు తెలుపుతున్నారు. మంగళవారం చిట్టమూరు మండలంలో ఇసుక విక్రయాలు జరపరాదంటూ రీచ్‌ల వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. మహిళా సమాఖ్యల ముసుగులో టీడీపీ నేతలు చేస్తున్న ఇసుక దందాలను గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో నిత్యం ఇసుక తవ్వకాలలకు సంబంధించి ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది.

Advertisement
Advertisement