కన్నతండ్రే కాలయముడు | Man killed his son in Guntur District | Sakshi
Sakshi News home page

కన్నతండ్రే కాలయముడు

Dec 7 2013 4:52 AM | Updated on Aug 16 2018 4:36 PM

కన్నతండ్రే కాలయముడు - Sakshi

కన్నతండ్రే కాలయముడు

కన్నులైనా తెరవని పసికందును కన్నతండ్రే కాలయముడుగా కర్కశంగా హత్యచేసిన సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో విషాదం నింపింది.

15 రోజుల శిశువును బండకేసి కొట్డాడు..
 నాదెండ్ల, న్యూస్‌లైన్:  కన్నులైనా తెరవని పసికందును కన్నతండ్రే కాలయముడుగా కర్కశంగా హత్యచేసిన సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో విషాదం నింపింది. గ్రామంలోని ఆదం షఫి, నూర్జహాన్‌ల కుమార్తె మిరాబీకి సత్తెనపల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన షేక్ ఉమర్‌తో 2012 ఏప్రిల్ 19న వివాహం జరిగింది. రెండు నెలలకే మనస్పర్థలు రావడంతో మీరాబీ పుట్టింటికి వచ్చేసింది. మనసు మార్చుకున్న ఉమర్ ఆరునెలల తరువాత వచ్చి, సాతులూరులోనే అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు.
 
 మళ్లీ గొడవలు రావడంతో సిరిపురం వెళ్లిపోయిన అతడు అప్పుడప్పుడు వచ్చివెళ్లేవాడు. గత నెల 23న మీరాబీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. వారం నుంచి సాతులూరులోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. రెండు రోజులుగా తనతోపాటు సిరిపురం రావాలని ఉమర్ భార్యను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన ఉమర్ ముక్కుపచ్చలారని పసికందును భార్య ఒడిలోంచి లాగి బండకేసి కొట్టాడు. ఆ చిన్నారి ఆ రాక్షసచర్యతో ప్రాణాలు కోల్పోయింది. గ్రామస్తులు ఉమర్‌ను పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement