వైద్యం కోసం వస్తే... ఉసురు తీశారు ! | Man Dies in CHC Doctors Negligence Visakhapatnam | Sakshi
Sakshi News home page

వైద్యం కోసం వస్తే... ఉసురు తీశారు !

Feb 8 2019 7:09 AM | Updated on Feb 8 2019 7:09 AM

Man Dies in CHC Doctors Negligence Visakhapatnam - Sakshi

సీహెచ్‌సీ వద్ద రోదిస్తున్న బంధువులు ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో మృతి చెందిన పాంగి లైకోన్‌

విశాఖపట్నం,ముంచంగిపుట్టు(పెదబయలు): తీవ్ర జ్వరంతో వైద్యం కోసం  సీహెచ్‌సీ వచ్చిన గిరిజన యువకుడు  మృత్యువాత పడడంతో అతని బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధాకారి నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందాడని కుటుంబ సభ్యులు  ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంచంగిపుట్టు మండలం పసనపుట్టు పంచాయతీ టిక్రపడ గ్రామానికి చెందిన పాంగి లైకోన్‌(27)కి తీవ్ర జ్వరం రావడంతో  గురువారం ఉదయం 9 గంటలకు ముంచంగిపుట్టు కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.  10 గంటలకు పాడేరు నుంచి వచ్చిన వైద్యాధికారి మోహన్‌రావు అతనిని పరీక్షించి, సిలైన్‌ బాటిల్‌ పెట్టి, ఇంజక్షన్‌ ఇచ్చారు.

కొంత సేపు ఉన్న వైద్యాధికారి  నర్సుకు  చెప్పి మళ్లీ పాడేరు  వెళ్లిపోయారు. డాక్టర్‌ వెళ్లిన రెండు గంటల తరువాత సాయంత్రం 4 గంటలకు లైకోన్‌ మృతి చెందాడు. దీంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారి నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డాడని ఆరోపిస్తూ బంధువులు సీహెచ్‌సీ ఎదుట  ఆందోళన  చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం  వస్తే శవంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.   గిరిజనులు ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. చేతికందిన కొడుకు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. లైకోన్‌ పరిస్థితి విషమంగా ఉన్నా ఎందుకు మెరుగైన వైద్యం కోసం తరలించ లేదని బంధువులు, స్థానిక నాయకులు వైద్య సిబ్బంది పై మండిపడ్డారు.

అంబులెన్సులున్నా  డ్రైవర్లు లేరు  
ముంచంగిపుట్టు  108 వాహనానికి ఫోన్‌  చేసినా  ఎవరూ స్పందించలేదు. పీహెచ్‌సీకి అంబులెన్స్‌ ఉన్నా  డ్రైవర్‌ లేడు.  ఫీడర్‌ అంబులెన్స్‌ ఉన్నా పైలట్‌ లేకపోవడంతో కింద స్థాయి సిబ్బందికి పాడేరు తరలించే అవకాశం లేకుండా పోయింది. ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి  వైద్యులు లేరు. గతంలో ఇక్కడ ఇద్దరు వైద్యులుండగా లబ్బూరు పీహెచ్‌సీకి ఒకరిని, మరొకరిని వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. దీంతో  సీహెచ్‌సీలో పూర్తిస్థాయి వైద్యులు లేకుండా పోయారు.   పాడేరుకు చెందిన మోహన్‌రావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

నాకు కాదు...ఆరోగ్య మంత్రికి చెప్పండి
ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని, వైద్యాధికారి లేక పూర్తి స్థాయి వైద్యం అందక గిరిజన యువకుడు మృతి చెందాడని విలేకరులు  వైద్య విధాన పరిషత్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ నాయక్‌కు పోన్‌ చేస్తే  ఆయన దురుసుగా సమాధానం చెప్పారు. వైద్యాధికారులను నియమించడం నా బాధ్యత  కాదని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అడగండని తెలిపారు. ప్రభుత్వం వద్ద వైద్యాధికారుల నియామకం ఫైల్‌ ఉందని చెప్పారు.

పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలి
పెదబయలు, ముంచగిపుట్టు మండలాలకు  పెద్ద దిక్కుగా ఉన్న ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి ఐదుగురు వైద్యులు ఉండాలి. కానీ  ప్రస్తుతం  పూర్తి స్థాయి వైద్యుడు ఒక్కరు కూడా లేకపోవడం దారుణమని మండల వైఎస్సార్‌ సీపీ నాయకులు అరిసెల చిట్టిబాబు, గాసీరావు, రామచందర్‌ తెలిపారు. తన సొంత నియోజకవర్గంలోనే పూర్తిస్థాయి వైద్యుడు లేకుండా సీహెచ్‌సీ నడుస్తుంటే  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రికి పట్టదా? అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement