‘భక్తికి కాకుండా మీడియా దేనికి ప్రచారం కల్పించాలి’

Madhupala shankar Sharma fires on Somayajulu commission - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి జిల్లా : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట ప్రమాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్‌ జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌పై పండితులు, ప్రవచనకర్తలు మండిపడుతున్నారు. పుష్కరాలపై పండితులు, మీడియాను తప్పుపట్టడం సరికాదని పంచాంగ జ్యోతిష్య పండితులు మధురపాల శంకర్‌ శర్మ ధ్వజమెత్తారు. పంచాంగ కర్తలపై నిందవేయడం దారుణమన్నారు. పుష్కరాల తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వవైఫల్యమేనని పేర్కొన్నారు. సంప్రదాయాలు లేని చోటే దుర్మార్గాలు పుట్టుకొస్తాయని నిప్పులు చెరిగారు. పండితులపై చేసిన వ్యాఖ్యలను జస్టిస్‌ సోమయాజులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అసలు గోదావరి పుష్కరాలకు ముహూర్తపెట్టింది పంచాంగ కర్తలు కాదని, అలాంటప్పుడు తమపై ఎందుకు నిందవేస్తున్నారన్నారు. భక్తి విషయాల్లో కాకుండా మీడియా దేనికి ప్రచారం కల్పించాలన్నారు. ఆధ్యాత్మిక విషయాలకు మీడియా ప్రచారం కల్పించకుండా, తప్పుడు విషయాలకు ప్రచారం చేయాలా అని ఆగ్రహం వ్య​క్తం చేశారు. ఆ కమిటీని మళ్లీ వేసి దాంట్లో సరైన పంచాంగ కర్తలని తీసుకొని, ముహూర్త దోషాలు ఉన్నాయా లేదా అని తేల్చాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ నివేదిక పారదర్శకంగా ఇచ్చిందని భావించడం లేదని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకుగరై  కమిషన్ నివేదిక ఇచ్చినట్లుందని తెలిపారు. గోదావరి పుష్కరాల దుర్ఘటనను భక్తుల నమ్మకాల మీదకు నెట్టేయడం దారుణమన్నారు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే దుర్ఘటనకు కారణమని పేర్కొన్నారు. పుష్కరాలను ప్రభుత్వం ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా తీసుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుష్కరఘాట్ లో స్నానం చేస్తారన్న విషయం ముందుగానే అధికారులు ప్రజలకు చెప్పాల్సిందని తెలిపారు. అలా చెప్పకుండా భక్తులను ఘాట్ బయట నిలబెట్టడం తప్పు అన్నారు.

కాగా, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందడానికి భక్తులు, పండితులు, ప్రసార మాధ్యమాలే కారణమని రిటైర్డ్‌ జస్టిస్‌ సోమయాజులు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ తేల్చేసింది. 2015 జూలై 14న పుష్కరాల తొలి రోజున స్నానాల సందర్భంగా తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ముహూర్త కాలంలోనే స్నానం చేయకపోతే పుణ్యం రాదేమోనన్న ఆందోళనతో భక్తులంతా ఒక్కసారిగా నదిలోకి దూసుకురావడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని నివేదికలో స్పష్టం చేయడం గమనార్హం. ఈ దుర్ఘటనపై మూడేళ్లపాటు సుదీర్ఘ విచారణ చేసిన జస్టిస్‌ సోమయాజులు కమిషన్‌ ఇచ్చిన ఈ నివేదికను చూసిన రాష్ట్ర ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top