అశోక్‌ లేలాండ్‌పై ఆగ్రహం

Lorry Owner Strike in front of Ashok Leyland Company - Sakshi

సేవల్లో జాప్యం..

లారీ యజమానికి రూ.10లక్షల నష్టం

కంపెనీ వారే పరిహారం చెల్లించాలని డిమాండ్‌

అశోక్‌ లేలాండ్‌ కార్యాలయం ఎదుట లారీ అసోసియేషన్‌ నాయకుల ధర్నా

అనంతపురం ,రాప్తాడు: అశోక్‌ లేలాండ్‌ కంపెనీ సేవల్లో జాప్యం కారణంగా పచ్చి సరుకు లోడుతో బయల్దేరిన లారీ సకాలంలో గమ్యానికి చేరుకోలేదు. దీంతో సరుకు నష్టాన్ని లారీ యజమానే చెల్లించాలని వ్యాపారి అల్టిమేటం జారీ చేశాడు. సరుకు దెబ్బతిని నష్టం జరగడానికి కారణమైన అశోక్‌ లేలాండ్‌ వారే పరిహారం చెల్లించాలని కోరుతూ లారీ అసోసియేషన్‌ నాయకులు బుధవారం ఉదయం రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి సమీపాన గల అశోక్‌ లేల్యాండ్‌ మ్యానుఫ్యాక్చరర్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం కోలార్‌కు చెందిన జావీద్‌ రూ.10 లక్షల విలువ చేసే టమాటాలను కోలార్‌ నుంచి ఒడిషా రాష్ట్రం బరగాడు తీసుకెళ్లేందుకు అనంతపురానికి చెందిన లారీ ఓనర్‌ నీలకంఠంకు చెందిన 14 చక్రాల అశోక్‌ లేలాండ్‌ లారీ (ఏపీ02 టిహెచ్‌ 3399)ని బాడుగకు మాట్లాడుకున్నారన్నారు. ఈ నెల 29న సోమవారం సాయంత్రం 4 గంటలకు బయల్దేరారని తెలిపారు. లారీ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు నాగపూర్‌ సమీపంలోని లింగన గాట్‌ దగ్గరకు రాగానే ఎలక్ట్రికల్‌ సమస్యతో నిలిచిపోయిందని పేర్కొన్నారు. 

రిపేరీ విషయంలో అంతులేని జాప్యం
అశోక్‌ లేలాండ్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌తో పాటు రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి దగ్గర ఉన్న అశోక్‌ లేలాండ్‌ ఆటోమోటివ్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అనంతపురం, కర్నూలు మేనేజర్లు వరదారాజులు, ముక్తార్‌కు సమాచారం ఇచ్చామన్నారు. లారీ నిలిచిపోయిన ప్రదేశానికి 50 కిలో మీటర్ల దూరంలోనే అశోక్‌ లేలాండ్‌ కార్యాలయం అందుబాటులో ఉన్నా అధికారులు స్పందించలేదన్నారు. లారీ నిలిచిపోయిందని ఫిర్యాదు చేసిన నాలుగు గంటల్లోనే సిబ్బంది వచ్చి రిపేరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. లారీ రిపేరీ కాదని సిబ్బంది చెప్పి ఉంటే లారీలో ఉన్న పచ్చి సరుకు టమాటాలను మరొక లారీ ద్వారానైనా బరగాడుకు చేర్చేవారమని అన్నారు. 

25 గంటలకు స్పందించిన సిబ్బంది
లారీ ఆగిపోయిందని సమాచారం ఇచ్చిన 25 గంటల తర్వాత సిబ్బంది స్పందించారు. వారు లారీ దగ్గరకు వచ్చే సరికి టమాటాలన్నీ చెడిపోయాయని తెలిపారు. దీంతో కోలార్‌ వ్యాపారి జావీద్‌ టమాటాలు చెడిపోయినందున తనకు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని, ఆ మొత్తాన్ని చెల్లించాలని లారీ ఓనర్‌ నీలకంఠంపై ఒత్తిడి తెచ్చాడన్నారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే అశోక్‌ లేలాండ్‌ సిబ్బంది 4 గంటల్లో వచ్చి సమస్యను పరిష్కరించి ఉంటే సరుకు పాడయ్యేది కాదన్నారు. సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఆలస్యమై సరుకు దెబ్బతినిందని, నష్టపరిహారం కింద అశోక్‌ లేలాండ్‌ అధికారులే చెల్లించాలని లారీ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. రోజుకు రూ.5వేల నుంచి రూ.15వేలు బాడుగలకు వెళ్లే లారీ ఓనర్లు రూ.10లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ప్రశ్నించారు. అశోక్‌ లేలాండ్‌ అధికారులు డబ్బు చెల్లించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. సాయంత్రమైనా అధికారులెవరూ స్పందించలేదు. ఎస్‌ఐ ఆంజనేయులు తమ సిబ్బందితో వచ్చి చర్చించి ధర్నా విరమించాలని కోరితే నాయకులు ఒప్పుకోలేదు. ఆందోళనను అలాగే కొనసాగించారు. కార్యక్రమంలో లారీ అసోసియేషన్‌ నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, మల్లి, నారాయణ, రామలింగారెడ్డి, రామ్మోహన్, రామాంజనేయ రెడ్డి, లక్ష్మినారాయణ, క్రిష్ణానాయక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top