జిల్లాకు ఆమడదూరంలో ఉన్న బొమ్మనహళ్ మండలం నేమకల్లు గ్రామంలో ఓ చిరుతపులి ప్రజలను ఆందోళనలకు గురి చేస్తోంది.
అనంతపురంలో చిరుత కలకలం
Mar 12 2017 9:21 AM | Updated on Jun 1 2018 8:36 PM
అనంతపురం: జిల్లాకు ఆమడదూరంలో ఉన్న బొమ్మనహళ్ మండలం నేమకల్లు గ్రామంలో ఓ చిరుతపులి ప్రజలను ఆందోళనలకు గురి చేస్తోంది. లింగన్న గౌడ్ అనే రైతు జొన్న చేలో నక్కిన చిరుత పనికి వెళ్లిన కూలీలపై దాడికి యత్నించింది. ఈ ఘటనలో కొందరు కూలీలు చిన్నగాయాలతో బయటపడ్డారు. కాగా, గ్రామంలో చిరుత సంచరిస్తున్న విషయాన్ని మండల తహశీల్దార్ ఫారెస్టు అధికారులు చేరవేశారు.
వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్టు అధికారుల టీం.. శనివారం నేమకల్లు పరిసర ప్రాంతాల్లోని పొలాలను పరిశీలించారు. జొన్న చొప్పను కోత కోయడానికి వెళ్ళిన కూలీలపై చిరుత ఒక్కసారిగా దూకి దాడి చేయబోయిందని రైతులు తెలిపారు. ఇద్దరు కూలీల భుజాలపై గాయాలయ్యాయని చెప్పారు. పొలంలో చిరుత రెండు పిల్లలకు జన్మనిచ్చి అక్కడే నివాసం ఏర్పరుచుకుందని అధికారులకు తెలిపారు.
రైతుల నుంచి వివరాలు తీసుకున్న ఫారెస్టు అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం రాత్రంతా చిరుత జాడ కోసం వెతికారు. ఎంతకూ చిరుత కనిపించకపోవడంతో గాలింపు చర్యలను మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. గ్రామస్తులు భయాందోళనలకు గురికావాల్సిన పనిలేదని చెప్పారు.
Advertisement
Advertisement