
సాక్షి, అమరావతి: రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అందరూ వ్యాపార వేత్తలుగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం సచివాలయంలో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన 34 మందితో కూడిన మొదటి విడత రైతుల బృందం సింగపూర్ పర్యటనను ముఖ్యమంత్రి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మలేసియా నుంచి విడిపోయిన 50 ఏళ్లకే సింగపూర్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, వ్యాపార అవకాశాలను ఎలా అందిపుచ్చుకుందో ఈ పర్యటనలో తెలుసుకోవాల్సిందిగా రైతులను కోరారు.
చేతిలో డబ్బులు లేకపోయినా మనసులో గట్టి సంకల్పం ఉంటే ఏ విధంగా ఎదగవచ్చో సింగపూర్ నిరూపించిందన్నారు. తానిచ్చే చేయూతను అందిపుచ్చుకోవాలని అలా కాకుండా చెడగొట్టే వారిని అనుసరిస్తే పతనమైపోతారని రైతులకు సూచించారు. కొంతమంది రెచ్చగొట్టిన వారి మాటలు విని భూములు ఇవ్వని వారి విషయంలో చట్టప్రకారం నడుచుకుంటామన్నారు.