జిల్లాలో భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా తయారైంది. నిధుల కొరతతో కొన్నిచోట్ల... కోర్టు కేసులతో మరికొన్ని చోట్ల భూసేకరణ ముందుకు సాగడం లేదు.
సాక్షి, కాకినాడ :జిల్లాలో భూసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా తయారైంది. నిధుల కొరతతో కొన్నిచోట్ల... కోర్టు కేసులతో మరికొన్ని చోట్ల భూసేకరణ ముందుకు సాగడం లేదు. కోర్టుల్లో పదేళ్లలో 353 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో 10వేల ఎకరాలకు పైగా భూసేకరణ ఆగిపోయింది. వీటి కోసం కేటాయించిన నిధుల్లో మూడోవంతువెనక్కి ్లపోగా, మిగిలినవి కొద్దోగొప్పో ఆయా శాఖల ఖాతాల్లో మూలుగుతున్నాయి.
పెండింగ్‌లో కేసులు..
జనరల్ ల్యాండ్ ఎక్విజిషన్ కింద సేకరించిన 4,180.51 ఎకరాలపై 188 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 5,219 ఎస్సీ లబ్ధిదారుల కోసం సేకరించిన 135.32 ఎకరాల భూసేకరణపై 23కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందిరమ్మ పథకంలో ఎంపిక చేసిన 30,418 మంది లబ్ధిదారుల కోసం ప్రతిపాదించిన 771.80 ఎకరాలపై 145 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రతిపాదించిన 17,186 ఎకరాల్లో ఇప్పటి వరకు 12,716 ఎకరాలను మాత్రమే సేకరించగలిగారు. ఇంకా 4,470 ఎకరాలు సేకరించాల్సి ఉంది. వీటిపై కేసులు కూడా కోర్టుల్లో నడుస్తున్నాయి.
ఆవిరవుతున్న పేదల ఆశలు
పెండింగ్ కేసులతో భూసేకరణ నిలిచిపోవడంతో నిరుపేదలకు సొంతింటికల కల్లగానే మిగిలింది. డివిజన్ల వారీగా చూస్తే కాకినాడ డివిజన్ పరిధిలో 12,390 మంది, రాజమండ్రి-6619మంది, రామచంద్రపురం- 1155 మంది, అమలాపురం-789 మంది, పెద్దాపురం-9455 మంది ఇందిరమ్మ లబ్ధిదారులున్నారు. ఇక సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా తలపెట్టిన భూసేకరణపై కేసులు పెండింగ్‌లో పడడం వలన కాకినాడ డివిజన్ పరిధిలో 2099మంది, రాజమండ్రి- 733 మంది, రామచంద్రపురం-920మంది, అమలాపురం-997, పెద్దాపురం-470 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఇంటిజాగా అందని ద్రాక్షగా మారింది.
ఏమూలకూ చాలని మిగులు నిధులు
కొత్త భూసేకరణ చట్టం-2013 జనవరి-1, 2014 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం జనవరి 1 తర్వాత సేకరించే భూములే కాదు..అవార్డు స్టేజ్ దాటని భూమి సేకరణ కూడా ఈ కొత్త చట్టం కిందే చేపట్టాలి. ప్రాంతాలను బట్టి మార్కెట్ రేటు కంటే రెండు లేదా మూడు రెట్ల అధికంగా పరిహారం ఇవ్వాల్సిందే. రాష్ర్ట విభజన నేపథ్యంలో భూసేకరణ కోసం కేటాయించిన నిధుల్లో మూడో వంతు నిధులు వెనక్కి మళ్లిపోయాయి. పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమైనా మిగిలిన నిధులు భూసేకరణకు ఏమూలకూ చాలవని అధికారులు చెబుతున్నారు. పదేళ్లుగా ఉన్న పెండింగ్ కేసుల్లో కనీసం 10శాతం కూడా అవార్డు స్టేజ్ దాటని విషయం గమనార్హం.
మార్గదర్శకాలు జారీ అయితేనే..
కొత్త భూసేకరణ చట్టం అమలులోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా మార్గదర్శకాలు జారీ కాలేదు. పెండింగ్ కేసులు పరిష్కారమవడంతోపాటు మార్గదర్శకాలు జారీ అయితే కానీ భూసేకరణ పనులు ముందుకు సాగవని అధికారులు చెబుతున్నారు.