తాగకున్నా తాగినట్లు చూపితే ఎలా? | Labor JAC fires on Depot Manager in Nellore | Sakshi
Sakshi News home page

తాగకున్నా తాగినట్లు చూపితే ఎలా?

Nov 5 2017 5:49 PM | Updated on Oct 20 2018 6:19 PM

Labor JAC fires on Depot Manager in Nellore - Sakshi

సాక్షి,ఆత్మకూరు: బ్రీత్‌ ఎనలైజర్‌ పరికరంలోని లోపం ఆర్టీసీ డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. మద్యం అంటే ఏమిటో ఎరుగని కార్మికులను తాగినట్లుగా చూపించడంతో కార్మికులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకంది. వివరాలివి.. చల్లా రవిరెడ్డి ఆత్మకూరు డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున డ్యూటీ ఎక్కుతున్న రవికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష చేశారు. అతను మద్యం సేవించినట్లు 10 పాయింట్లు నమోదవడంతో సస్పెండ్‌ చేసేందుకు డిపో అధికారులు సిద్ధమయ్యారు.

మళ్లీ పరీక్ష చేయాలి..
దీంతో సహ కార్మికులు అసలు మద్యం ముట్టని రవిని మద్యం సేవించాడని నిర్ధారించడం సరికాదని వాగ్వాదానికి దిగారు. మళ్లీ పరీక్ష చేయాలని కోరగా అధికారులు ససేమిరా అన్నారు. విషయం తెలిసి అన్ని కార్మిక యూనియన్ల నాయకులు అక్కడికి చేరుకుని అనుమానం ఉంటే ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు  చేయించాలని కోరారు. అలా కుదరిని పక్షంలో అదే పరికరంతో మళ్లీ పరీక్షించాల్సిందేనని పట్టుబట్టారు. 

ధర్నాకు దిగిన కార్మిక జేఏసీ..
యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఆకస్మిక దర్నా చేపట్టారు. అప్పటికి డిపో నుంచి కేవలం ఒక్క బస్సు మాత్రమే బయటకు వెళ్లింది.  అయితే మిగిలిన బస్సులను కదనివ్వబోమంటూ కార్మికులు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. డిపో మేనేజర్‌ త్రినాథరావు వచ్చి బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా రెండోసారి పరీక్షలకు నిబంధనలు ఓప్పుకోవన్నారు. మద్యం అలవాటే లేని కార్మికులను తాగుబోతులుగా చూపుతున్న బ్రీత్‌ ఎనలైజర్‌ను మార్చాలని, న్యాయం జరిగే వరకు దర్నా విరమించేది లేదని కార్మికులు పట్టుబట్టారు. దీంతో మూడు గంటలకుపైగా బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి.

దిగొచ్చిన డీఎం..
విషయం తెలుసుకుని  డిపోకు వచ్చిన మీడియాపై  డీఎం త్రినాథరావు మిమ్మల్ని ఎవరు  రమ్మన్నారని కోపం ప్రదర్శించారు. చివరకు ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి అందరి ఎదుట డ్రైవర్‌ రవిని రెండోసారి పరీక్షించగా సున్న(0)గా నమోదైంది. మిషన్‌లో పొరపాటు పెట్టుకుని కార్మికులను క్షభకు గురిచేయడం తగదని కార్మిక జేఏసీ అన్నారు. గతంలోనూ ఇలానే ఒకరిని సస్పెండ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మికులు ధర్నా విరమించారు. కాగా, ఈ సంఘటనపై డీఎం త్రినాథరావును ప్రశ్నించగా రెండవసారి కార్మికుడు అధికంగా నీళ్లు తాగి పరీక్షలు చేయించకోవడంలో అలా నమోదైందని వ్యాఖ్యానించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement