కర్నూలు నంబర్‌ వన్‌

Kurnool First In matritva vandana yojana Scheme - Sakshi

‘మాతృత్వ వందన యోజన’ అమలులో దక్షిణాదిన అగ్రస్థానం

7న డెహ్రాడూన్‌లో కలెక్టర్, డీఎంహెచ్‌వోలకు అవార్డులు

కర్నూలు(హాస్పిటల్‌): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) అమలులో కర్నూలు జిల్లా దక్షిణాదిన ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. తద్వారా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అవార్డును కైవసం చేసుకుంది. ఈ నెల ఏడోతేదీన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్‌ఎస్‌.సత్యనారాయణ, డీఎంహెచ్‌వోడాక్టర్‌ జేవీవీఆర్‌కే ప్రసాద్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ పథకాన్ని 2017 సెప్టెంబర్‌ ఒకటో తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లాంఛనంగా ప్రారంభించారు. దీని కింద  గర్భిణిగా నమోదైన వెంటనే రూ.1000లు, ఆరో నెలలో మరో రూ.2వేలు, ఆసుపత్రిలో ప్రసవించాక రూ.1000లు, శిశువుకు మూడు విడతల రోగ నిరోధక టీకాలు అందించిన తర్వాత రూ.2వేలు కలిపి మొత్తం రూ.6వేలు ప్రోత్సాహక నగదు అందిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఈ పథకం పెద్దగా అమలు కాలేదు.

అయితే.. డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ జేవీవీఆర్‌కే ప్రసాద్‌ పథకం అమలుపై దృష్టి సారించారు. కలెక్టర్‌ పర్యవేక్షణలో ఆరోగ్యశాఖ మాత్రమే గాక ఐసీడీఎస్, ఆశా కార్యకర్తలు, మెప్మా సహకారంతో అర్హులైన గర్భిణులను గుర్తించారు. వారి బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయించారు. వారందరికీ పథకాన్ని వర్తించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ‘తల్లీబిడ్డ చల్లగా..’ అని పేరు మార్చి అమలు చేస్తోంది. దీని కింద ఇప్పటి వరకు జిల్లాలో 38,672 మందికి రూ.9,41,81,000  నగదు అందించారు. 

అభినందనల వెల్లువ.. పీఎంఎంవీవై  అమలులో జిల్లాకు ప్రథమ స్థానం దక్కడంతో కలెక్టర్‌ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో  జేవీవీఆర్‌కే ప్రసాద్‌లకు మంగళవారం కలెక్టరేట్‌లో ఇతర శాఖల అధికారులు అభినందనలు తెలిపారు.    కార్యక్రమంలో ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీ శశిదేవి, డీఈవో తెహరాసుల్తానా, డీఐవో డాక్టర్‌ వెంకటరమణ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top