లాహిరి లాహిరి లాహిరిలో.. | Krishna river waters receding, says official | Sakshi
Sakshi News home page

లాహిరి లాహిరి లాహిరిలో..

Jul 7 2015 1:22 AM | Updated on Sep 3 2017 5:01 AM

లాహిరి లాహిరి లాహిరిలో..

లాహిరి లాహిరి లాహిరిలో..

పాపికొండలు.. ప్రకృతి రమణీయత అంతా ఒకేచోట కొలువుదీరినట్లు అనిపించే సుందర ప్రాంతం.

కృష్ణానదిలో విహారం.. నల్లమల మధ్య పర్యాటక విడిది
కొల్లాపూర్ ఎకో టూరిజం ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా
సోమశిల-శ్రీశైలం బోటింగ్ ఏర్పాటు.. అక్కమహాదేవి గుహలకు కొత్త హంగులు
చీమల తిప్ప దీవి, శ్రీవారి సముద్రం రిజర్వాయర్‌ల అభివృద్ధి
రూ.350 కోట్లతో బృహత్తర ప్రాజెక్టు.. కేంద్రం నుంచి రూ.100 కోట్లు

సాక్షి, హైదరాబాద్: పాపికొండలు.. ప్రకృతి రమణీయత అంతా ఒకేచోట కొలువుదీరినట్లు అనిపించే సుందర ప్రాంతం.

ఇప్పుడది ఆంధ్రప్రదేశ్‌లో భాగం. అలాంటి పర్యాటక స్వర్గధామం ఇప్పుడు తెలంగాణలోనూ కనువిందు చేయనుంది. ఇందుకోసం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ కేంద్రంగా ఒక బృహత్తర ప్రాజెక్టు సిద్ధం కాబోతోంది. దాదాపు రూ.350 కోట్లతో రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. తన వంతుగా రూ.100 కోట్ల వరకు ఇచ్చేందుకు ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆధ్యాత్మికం, వినోదం ప్రధానాంశాలుగా రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ఎకో టూరిజం ప్రాజెక్టును తీర్చిదిద్దబోతోంది. సోమవారం ఢిల్లీలో జరిగిన కీలక భేటీలో కేంద్ర పర్యాటక శాఖ దీనికి ఆమోదం తెలిపింది. కొత్తగా ప్రారంభించిన పర్యాటక పథకం ‘స్వదేశ్ దర్శన్’ కింద నిధులు కేటాయించేందుకు సుముఖత తెలిపింది.
 
ఏం చేస్తారు?: నల్లమలలోని సోమశిల ప్రాజెక్టు వద్ద ప్రకృతి సౌందర్యాన్ని ఒడిసిపట్టి పర్యాటకులకు మధురానుభూతి మిగిల్చేలా తీర్చిదిద్దబోతున్నారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో బోటింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పర్యాటకులు విహరించొచ్చు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరువలో ఉన్న అక్క మహాదేవి గుహలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారు. అక్కడ లైటింగ్‌తోపాటు పర్యాటకులకు కాటేజీలను నిర్మిస్తారు. శ్రీశైలం-సోమశిల నీటిమార్గం ఏర్పాటు ఇది.

ఇక సోమశిల ద్వాదశ జ్యోతిర్లింగాలయం (లలితాంబిక సోమేశ్వరాలయం), జటుప్రోలు మదనగోపాల స్వామి ఆలయం, శాతవాహనకాలంలో 20 ఆలయాల సమూహంగా రూపుదిద్దుకున్న మూక గుడులు, సింగోటం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలను ఈ ప్రాజెక్టులో చేర్చారు. కృష్ణా నది మధ్యలో ప్రశాంతంగా ఉండే చీమల తిప్ప దీవిని పర్యాటకుల విడిది కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు.

శ్రీవారి సముద్రం రిజర్వాయర్‌ను కూడా పర్యాటకులు సందర్శించేలా హంగులు అద్దుతారు. సురభిరాజుల బంగ్లా లాంటి చారిత్రాక కట్టడాలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రధాన దేవాలయాలు, సందర్శనీయ స్థలాలు కాకుండా మరో పది విడిదులను ఈ ఎకో టూరిజం ప్రాజెక్టులో చేర్చారు. దీన్ని పీపీపీ పద్ధతిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ప్రణాళికను మరికొద్ది రోజుల్లో రూపొందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement