
ప్రకాశం బ్యారేజి వద్ద 15.9 అడుగులకు చేరిన నీటిమట్టం
రాత్రి ఏడు గంటలకు 6,54,876 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఎగువున అడుగు మేర పెరిగిన వరద
దిగువన కరకట్ట అంచులు తాకుతూ ఉధృతంగా ప్రవాహం
నీటమునిగిన అరటి, పసుపు, కంద తదితర పంటలు
పలు గ్రామాలు జలమయం.. ఆందోళనలో ప్రజలు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/కంకిపాడు/ధవళేశ్వరం/విజయపురిసౌత్/మలికిపురం: ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణమ్మ పోటెత్తింది. రెండ్రోజులుగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. అయితే, సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతానికి 6,74,971 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో రాత్రి ఏడు గంటల సమయానికి 6,54,876 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 15.9 అడుగుల నీటి మట్టం ఉంది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఒక అడుగు మేర వరద పెరిగింది.
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దాములూరు, మూలపాడు, కొటికలపూడి, జూపూడి, త్రిలోచనాపురం, లంక గ్రామాల్లో మినుము పంట ముంపునకు గురైంది. 700 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ముక్త్యాల–జగ్గయ్యపేట రహదారిలో చంద్రమ్మ కయ్య పొంగి ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
రావిరాల బీసీ కాలనీ వాసులు రెండో రోజు కూడా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందారు. ముక్త్యాల, రావిరాల, కె.అగ్రహారం గ్రామాల్లోని పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పోటెత్తడంతో భవానీపురం బెరంపార్క్‌లోకి నీరు వచ్చి చేరింది. ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసినప్పటికీ ప్రవాహం ఆగలేదు. దీంతో హరిత బెరంపార్క్‌లోకి పర్యాటకులు, సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించారు.
ఏటిపాయ ప్రాంతాల్లో వరద ముంపు
కృష్ణాజిల్లాలోని పెనమలూరు, పామర్రు మండలాలు, దివిసీమ ప్రాంతాల్లో ఏటిపాయ వెంబడి ఉన్న ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వరదనీరు కరకట్ట అంచులు తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. తోట్లవల్లూరు, పెనమలూరు, కంకిపాడు మండలాల్లో కరకట్ట వెంబడి ఉన్న పంట పొలాలు ముంపుబారిన పడ్డాయి. ప్రధానంగా అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు నీట మునిగాయి. పెనమలూరు మండలంలో కరకట్ట వెంబడి గ్రామాల్లో వేలాది నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి.

అలాగే, దివిసీమ పరిధిలోని ఎడ్లంక గ్రామంలోకి కూడా వరద చొచ్చుకొచ్చింది. రహదారి మార్గం మూసుకుపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు నివాసాల్లోకి నీరు చేరింది. నివాసితులు సామాన్లను తరలిస్తున్నారు. అలాగే, ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో లంక గ్రామాలు, కరకట్ట వెంబడి ప్రాంతాలు ముంపుబారిన పడే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

శ్రీశైలం నుంచి 5,91,456 క్యూసెక్కులు విడుదల
శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 5,91,456 క్యూసెక్కులు వచ్చి చేరటంతో వచ్చిన నీరు వచి్చనట్టు దిగువకు వదులుతున్నారు. సోమవారం 24 క్రస్ట్‌గేట్లు 15 అడుగులు, రెండు గేట్లు 20 అడుగుల మేర ఎత్తి 5,41,516 క్యూసెక్కులను దిగువకు వదిలారు. కుడికాలువకు 9,533, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,333, ఎస్‌ఎల్‌బీసీకి 1,200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
నిలకడగా గోదావరి
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం నిలకడగా ఉంది. సోమవారం ఉదయం 6.15 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.70 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అదే స్థాయిలో నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది.
బ్యారేజీ నుంచి 9,59,784 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. డెల్టా కాలువలకు 12,500 క్యూసెక్కులు వదిలారు. ఎగువన నీటి ఉధృతి పెరుగుతుండటంతో కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
తీరంలో అలజడి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని తీర ప్రాంతంలో సముద్రం ముందుకు వస్తుండటంతో ప్రజల్లో అలజడి మొదలైంది. అంతర్వేది నుంచి కరవాక వరకు సుమారు 25 కిలోమీటర్ల మేర సోమవారం సముద్రం 300 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చింది.
వరద కారణంగా గోదావరి పాయల నుంచి భారీగా నీరు చేరుతుండటంతో సముద్రం ముందుకొస్తోంది. సముద్రపు అలలు వేగంగా దూసుకురావడం వల్ల తీర ప్రాంతం కోతకు గురవుతోంది. ముఖ్యంగా అంతర్వేది లైట్ హౌస్ వద్ద తీరం అధికంగా కోతకు గురవుతున్నట్లు కనిపిస్తోంది.