కంటైనర్‌లలోనే వారి కాపురాలు 

Korean People Are Living In Containers At Kiya Manufacturing Company Near Penukonda - Sakshi

సాక్షి, పెనుకొండ : ఈ భవనం కియా కార్ల పరిశ్రమ సమీపంలోని ఎర్రమంచి రహదారిలో కంటైనర్‌లతో నిర్మించారు. ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించిన దీని పేరు ‘విదమ్‌ హాస్పెటాలిటీ’ పేరుతో కొరియన్‌లకు ఆతిథ్యం కల్పిస్తున్నారు. బేగ్‌ అనే కొరియన్‌ దీనిని నిర్వహిస్తున్నాడు. కంటైనర్‌లలో భవంతులు నిర్మించి నిబంధనలకు తూట్లు పొడిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాలు కియా కార్ల పరిశ్రమ ప్రాంతంలో అనేక మంది నిర్వహిస్తున్నారు.  

పెనుకొండ మండలంలో కియా కార్ల పరిశ్రమ ప్రారంభమై రెండేళ్లవుతోంది. ఇందులో పని చేయడానికి వందలాది మంది కొరియన్లు వారి దేశం నుంచి ఇక్కడికి వచ్చారు. పలువురు కొరియన్‌లు సమీపంలోని భవనాల్లో బాడుగలకు ఉంటున్నారు. మరి కొందరు కంటైనర్‌ బాక్సులతో రూపొందించిన భవనాల్లో నివసిస్తున్నారు. లక్షలాది రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నారు.  

భద్రత డొల్ల.. 
కంటైనర్‌లలో కాపురం ఉండడం అంత శ్రేయస్కరం కాదని పలువురు పేర్కొంటున్నారు. ఏ మాత్రం షార్ట్‌సర్క్యూట్‌ జరిగినా, ఏ ఇతర ప్రమాద సమయాల్లోనైనా ప్రాణాపాయం తప్పదని అభిప్రాయపడుతున్నారు. 2017లో కంటైనర్‌లో నివాసం ఉంటున్న తాడిపత్రికి చెందిన ఇద్దరు బేల్దార్లు పొగ ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో కంటైనర్‌ కాపురాలు మరిన్ని పెరగడం ఆందోళన రేపుతోంది.  

అనుమతులు ప్రశ్నార్థకమే? 
ఒక భవనం నిర్మించాలంటే గ్రామ పంచాయతీ లేదా అహుడా అనుమతి ఉండాలి. అయితే కంటైనర్‌ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని, కేవలం ధనార్జనే ధ్యేయంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఒక్క అధికారి కూడా దీనిని ప్రశి్నంచకపోవడంతో నిర్మాణాలు మరింత జోరందుకుంటున్నాయి. అధికారులు చేతివాటం ప్రదర్శించడం వల్లే వీటి నిర్మాణాలు అధికమవుతున్నాయనే విమర్శలుమున్నాయి. ఇప్పటికే ఎర్రమంచి, హరిపురం, అమ్మవారుపల్లి, దుద్దేబండ ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు జరిగాయి. కియా, ఏపీఐఐసీ అతిథి గృహాలు సైతం కంటైనర్‌లతో నిరి్మంచడం గమనార్హం. అధికారులు తగిన చర్యలు తీసుకుని ఇలాంటి నిర్మాణాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top