సీపీఎస్‌ ఉద్యోగులపై ప్రభుత్వ మొండి వైఖరి

 kolusu parthasarathy fire ap govt cm chandrababu naidu - Sakshi

వైఎస్సార్‌ సీపీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : సీపీఎస్‌ ఉద్యోగులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అన్నారు. అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో సీపీఎస్‌ రద్దు కోరుతూ ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు దీక్షలో పార్థసారథి పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఎందుకు సీపీఎస్‌ రద్దు చేయమని కోరుతున్నారో కనీసం ప్రభుత్వం ఆలోచన చేయడం లేదన్నారు. 

బాబు ప్రభుత్వం అహంకార ధోరణితో పని చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఏ క్షణాన పుట్టారోగానీ అందరినీ నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్న అనుమానం కలుగుతోందని తెలిపారు. సీపీఎస్‌ కారణంగా ఉద్యోగులు అనుభవిస్తున్న మనో వేదనను చంద్రబాబు ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్య పెన్షన్లను సీపీఎస్‌ విధానంలోకి తీసుకువచ్చి మీ పేర బాండ్లు, షేర్లు ఉన్నాయంటూ సామాన్యులను ఒప్పిస్తాడేమోనన్న సందేహం వ్యక్తపరిచారు. 

ఉద్యోగులకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజులకే సీపీఎస్‌ రద్దు చేస్తుందని ప్రకటించారు. ఈ దేశంలో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ వైఎస్సార్‌ సీపీయేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌ ఈ మేరకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ ద్వారా 1.80 లక్షల మంది ఉద్యోగులకు జగన్‌ భరోసా కల్పించారన్నారు. ఏపీసీపీఎస్‌ఈఏ అధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్‌ మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేసేవారికే ఉద్యోగులు అండగా ఉంటారన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌కు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. దీక్షలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top