సమస్యలు కో‘కొల్లు’లు.. | Sakshi
Sakshi News home page

సమస్యలు కో‘కొల్లు’లు..

Published Thu, Mar 21 2019 11:00 AM

Kollu Ravindra Had Failed To Develope His Own Constituency - Sakshi

సాక్షి, మచిలీపట్నం : ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసినా ఈ ప్రాంత అభివృద్ధికి కొల్లు రవీంద్ర చేసింది శూన్యమని ప్రజలు విమర్శిస్తున్నారు. కొల్లు స్వగ్రామంగా చెప్పుకునే ‘గరాల దిబ్బ’ సమస్యలతో సతమతమవుతోంది. ‘మంత్రి మనోడే’ నని సమస్యలు తీరకపోతాయా...? అని ఐదేళ్లు పాటు ప్రజలు ఆశగా ఎదురుచూసినప్పటకీ, మౌలిక వసతులు మెరుగపడలేదు. గ్రామంలో అంతా మత్స్యకారులే. నిరుపేదలైన వీరికి ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు కూడా సవ్యంగా అందలేదు. తాగునీటికి తీవ్రమైన ఇక్కట్లు పడుతున్నారు. తమ ఇబ్బందులు చెబితే ఎక్కడ తమకు వచ్చే సంక్షేమ పథకాలకు అడ్డం పడతారేమోననే ఆందోళన ఇక్కడి ప్రజానీకంలో ఉంది. 

అర్హులకు అందని పథకాలు
గ్రామంలో అర్హులకు రేషన్‌ కార్డులు లేవు. చదువులపై మంచి ఆసక్తి చూపే యువత ఉన్న గ్రామంలో ఒకప్పుడు 72 మంది ఉద్యోగులు ఇక్కడ ఉండేవారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇక్కడి వారు ఉద్యోగాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు.   గ్రామం చుట్టూ అసైన్డ్‌ భూములున్నా తాతలు, తండ్రులు నాడు ఇచ్చిన హక్కు పత్రాలే  దిక్కయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి పత్రాలు ఇవ్వకపోవటంతో ఒకే ఇంట్లో మూడేసి కుటుంబాలు నివసిస్తున్నారు. సీసీ రోడ్లు నిర్మించినా.. మురుగు వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు ఇళ్లవద్దనే నిల్వ ఉంటున్నాయి. విద్యుత్‌ స్తంభాలకు వీధి దీపాలు  అలంకార ప్రాయంగా మారాయి. దీంతో ప్రజలు గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు.  

ప్రతీ రోజూ‘పానీ’ పాట్లే! 

గరాలదిబ్బ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలో చేతిపంపులు ఉన్నప్పటకీ, ఉప్పునీరు కావటంతో మునిసిపాలిటీ వారు సరఫరా చేసే తాగునీరే ఆధారం. ఇవి కూడా రోజు విడిచి రోజు వస్తుంటాయి. దీంతో నల్లాల నుంచి వచ్చే సన్నటి ధార కోసం బిందెలు పట్టుకొని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. 

తాగునీటికి కష్టాలు 
బిందెడు మంచినీళ్లు పట్టుకునేందుకు పైపుల వద్ద గంటల తరబడి ఉండాలి. వీధుల్లో ఉన్న నల్లాల వద్ద మంచినీళ్లు పట్టుకునేందుకు బిందెలు ముందుగానే వరుసుగా పట్టాలి. రోజులో ఒక్కసారి అది కూడా ఒక గంట మాత్రమే నీళ్లు వస్తుంటాయి. చేతి పంపులు ఉన్నప్పటకీ, ఉప్పు నీరు కావడంతో తాగలేం. నల్లాల నుంచి వచ్చే నీరు  రెండు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. 
– కె.జయంతి

ఆర్భాటపు ప్రచారం
నిరుద్యోగ భృతి మంజూరు చేయాలంటూ అధికారులకు అర్జీ ఇచ్చాను. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు.  డిగ్రీ చదివి కుటుంబం గడువడానికి కూలి పనులకు వెళ్తున్నాను.  ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలే తప్ప నాలాంటి అర్హులైన వారికి న్యాయం చేయటం లేదు.
– ఒడుగు దుర్గారావు

Advertisement
Advertisement