‘‘విద్యాభివృద్ధి బాధ్యత ప్రభుత్వానిది మాత్రమే కాదు.. రాష్ట్రంలో విద్యాసంస్థల ఏర్పాటుకు ముందుకు రావాలని దాతలను కోరుతున్నా
గురుపూజోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం : ‘‘విద్యాభివృద్ధి బాధ్యత ప్రభుత్వానిది మాత్రమే కాదు.. రాష్ట్రంలో విద్యాసంస్థల ఏర్పాటుకు ముందుకు రావాలని దాతలను కోరుతున్నా. వారితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కో రూ.కోటి చొప్పున ఇస్తే కనీసం రూ.వంద కోట్లవుతుంది. ఆ సొమ్ముతో విశ్వవిద్యాలయాలను అభివృద్ధికి చేయొచ్చు. దయచేసి సహకరించండి‘’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం రాష్ట్రస్థాయి గురుపూజోత్సవంలో ఆయన ప్రసంగించారు. విదేశాల్లో విశ్వవిద్యాలయాలకు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కింద రూ.కోట్ల నిధులు వస్తున్నాయని చెప్పారు. మన రాష్ట్రంలోనూ ఆ తరహా దాతలు ముందుకు రావాలని కోరారు. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మారుస్తానని ప్రకటించారు.
టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం
వచ్చే ఏడాది ఆరంభానికల్లా టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని, అన్ని పాఠశాలల్లో వసతులు కల్పిస్తామని సీఎం తెలిపారు. సంక్షేమ హాస్టళ్ల సంఖ్యను తగ్గించి, రెసిడెన్షియల్ స్కూళ్లను పెంచుతామన్నారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోసం టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీఎంహెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్‌ను సీఎం ప్రారంభించారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు
గురు పూజోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన 158 మంది గురువులకు సీఎం పురస్కారాలను ఇచ్చి సత్కరించారు.
షార్ట్ సర్క్యూట్‌తో సభలో పొగలు
గురుపూజోత్సవ సభలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పొగలు వ్యాపించాయి. విద్యుత్ సిబ్బంది అప్రమత్తం కావడంతో ఘోర ప్రమాదం తప్పింది. సిబ్బంది వచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రమాదం లేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని వేదికపై నుంచి అధికారులు మైక్‌లో ప్రకటించారు.