గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువ ఉద్యోగి మృతి చెందాడు. గన్నవరం ఆంధ్రాబ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పంచువర్తి శివదిలీప్ (24) స్థానికంగా నివసిస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువ ఉద్యోగి మృతి చెందాడు. గన్నవరం ఆంధ్రాబ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పంచువర్తి శివదిలీప్ (24) స్థానికంగా నివసిస్తున్నారు. బ్యాంక్‌లో శుక్రవారం విధులు ముగించుకున్న అనంతరం రికవరీ పనిపై విజయవాడ వస్తుండగా కేసరపల్లి సమీపంలో వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది.
ఈ ఘటనలో తీవ్ర గాయాలైన శివదిలీప్‌ను 108లో తొలుత నగరంలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే పరిస్థితి విషమించినట్లు చెప్పడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించగా మార్గంలోనే మృతిచెందాడు. కంచికచర్లకు చెందిన శివదిలీప్ రెండేళ్ల కిందట బ్యాంక్‌లో ఉద్యోగం పొందిగా, ఆరు నెలల కిందటే గన్నవరం బ్రాంచి అసిస్టెంట్ మేనేజర్‌గా వచ్చినట్లు చెపుతున్నారు. ఇటీవల కొత్త బైక్ కొనుగోలు చేశాడని, దానిపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడని పలువురు ఉద్యోగులు చెపుతున్నారు. తమ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మృతి చెందిన సమాచారం తెలుసుకున్న డెప్యూటీ జనరల్ మేనేజర్ రవికుమార్ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని, అతని వివరాలు సేకరించారు.
కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు
రోడ్డు ప్రమాదంలో శివదిలీప్ మృతి చెందిన వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కంచికచర్ల నుంచి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. అతని తల్లి మృతదేహంపై పడి విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. చిన్న వయసులోనే ఉద్యోగం సాధించి, ఇంతలోనే దూరమయ్యావా అంటూ భోరున విలపించింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.