వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లె మండలంలో కొత్తగా నిర్మించిన ఎల్లాయిపల్లె రైల్వేట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం వద్ద నాగ సుబ్బారెడ్డి(58) అనే వ్యక్తిని ఇద్దరు దుండగులు పెట్రోలు పోసి తగులబెట్టారు.
ఓబులవారిపల్లె : వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లె మండలంలో కొత్తగా నిర్మించిన ఎల్లాయిపల్లె రైల్వేట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం వద్ద నాగ సుబ్బారెడ్డి(58) అనే వ్యక్తిని ఇద్దరు దుండగులు పెట్రోలు పోసి తగులబెట్టారు. పోలీసుల కథనం ప్రకారం... రైల్వేకోడూరుకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తిని ప్రసాద్, బాషా అనే ఇద్దరు వ్యక్తులు గురువారం కిడ్నాప్ చేశారు. రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సుబ్బారెడ్డి మొబైల్ నుంచే అతని కుమారుడు హర్షవర్థన్ రెడ్డికి ఎస్‌ఎంఎస్ పంపారు. తండ్రిని విడిపించుకోవడానికి హర్షవర్థన్ రెడ్డి కిడ్నాపర్లకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. మరి ఏమైందో ఏమో కానీ ఆ ఇద్దరు దుండగుల నుండి ఎటువంటి సమాచారం అందకపోవడంతో హర్షవర్థన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం ఆ ఇద్దర్ని అరెస్టు చేసి సుబ్బారెడ్డి ఆచూకీ కోసం తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకొని, అసలు విషయం బయటపెట్టారు.
ఓబులవారిపల్లె మండలంలో కొత్తగా నిర్మించిన ఎల్లాయిపల్లె రైల్వేట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి సుబ్బారెడ్డిని తీసుకెళ్లి పెట్రోలు పోసి తగలపెట్టామని చెప్పారు. దుండగులు చూపించిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.