కొంకుదురులో అదృశ్యం.. కాకినాడలో ప్రత్యక్షం

Kidnap Attempt On HM Srinivas Reddy In Kakinada - Sakshi

కలకలం రేపిన హెచ్‌ఎం కిడ్నాప్‌ వ్యవహారం

సాక్షి, బిక్కవోలు (తూర్పుగోదావరి) : మండలంలోని కొంకుదురు, కే.సావరం గ్రామాల మధ్య శుక్రవారం సాయంత్రం పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన సత్తి శ్రీనివాసరెడ్డి ఆలియాస్‌ వార్త శ్రీను మాయమై ఐదు గంటల అనంతరం కాకినాడ రెండో పట్టణ పోలీస్టేషన్‌లో ప్రత్యక్షమైన ఘటన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ వార్త బిక్కవోలు, పెదపూడి మండలాల్లో చర్చనీయాంశమైంది. శుక్రవారం సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం తొస్సిపూడి నుంచి కొంకుదురు మీదుగా స్వగ్రామం మామిడాడ బయలుదేరాడు. కొంకుదురు దాటిన తరువాత సావరం వద్ద నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని దుండగులు శ్రీనివాసరెడ్డి కారును వెనుక నుంచి ఢీకొట్టారు.

దీంతో కారు ఆపి కిందకు దిగిన అతడిని దుండగులు దాడి చేసి తమ కారులోకి బలవంతంగా తీసుకుని పోయారని కుమారుడు శివారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దీనికంతటికి శ్రీనివాసరెడ్డి గతంలో ఫైనాన్స్‌ వ్యాపారికి ఇవ్వవలసిన నగదు బకాయే కారణమని పలు అనుమానాలు ఉన్నాయి. ఈ లోపు శ్రీనివాసరెడ్డి కాకినాడ పోలీస్టేషన్‌కు చేరుకుని తాను కిడ్నాప్‌కు గురికాలేదని వాంగ్మూలం ఇచ్చినట్టు పోలీసులు తెలపడంతో కథ సుఖాంతమైంది..

నేను కిడ్నాప్‌ కాలేదు 
ఐదు గంటల పాటు ఉత్కంఠ రేపిన శ్రీనివాసరెడ్డి కిడ్నాప్‌ వ్యవహారం ఆయన వాగ్మూంలంతో సద్దుమణిగింది. తనను ఎవ్వరూ కిడ్నాప్‌ చేయలేదని స్కూల్‌ నుంచి ఇంటికి వస్తుండగా కారుకు ప్రమాదం జరిగిందని, దీంతో హుటాహుటిన కాకినాడ ఆసుపత్రికి వెళ్లగా ఫోన్‌ స్విచ్చాఫ్‌ కావడంతో కిడ్నాపయ్యానని అందరు ఆందోళన చెందారని, తాను పోలీసుల వద్ద క్షేమంగానే ఉన్నానని శ్రీనివాసరెడ్డి తెలిపినట్టు ఎస్సై వాసు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top