గుంతకల్లులో కర్తవ్యం సినిమా సీన్‌ | Kartavyam Cinema scene in Guntakal | Sakshi
Sakshi News home page

గుంతకల్లులో కర్తవ్యం సినిమా సీన్‌

Dec 1 2013 5:37 PM | Updated on May 25 2018 5:59 PM

గుంతకల్లులో కర్తవ్యం సినిమా సీన్‌ - Sakshi

గుంతకల్లులో కర్తవ్యం సినిమా సీన్‌

అనంతపురం జిల్లా గుంతకల్లులో కర్తవ్యం సినిమా సీన్ లైవ్లో చూపించారు పోలీసులు‌.

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లులో కర్తవ్యం సినిమా సీన్ లైవ్లో చూపించారు పోలీసులు‌.  దోషులు దొరికితే దులిపేయడమే ఈ సినామాలో విజయశాంతి స్టైల్‌.  గుంతకల్‌లో మహిళాపోలీస్‌ అధికారి సుప్రజ  కూడా  కర్తవ్యం విజయశాంతిని మరిపించారు. రక్తం రుచిమరిగిన హంతకులకు నడిరోడ్డుపై తగిన శాస్తి చేశారు. డీఎస్పి సుప్రజ ఆదేశాలతో గుంతకల్‌ పోలీసులు గబ్బర్‌ సింగుల్లా చెలరేగిపోయారు. నిందితులను పట్టుకుని ఊర్లో ఊరేగించడంతోపాటు బహిరంగంగా రోడ్డుపైనే లాఠీలతో వారికి గానాభజానా చేశారు. రోడ్డు మీదే నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కౌన్సిలింగ్ అంటే మాటలనుకునేదు. ఏకంగా లాఠీ దెబ్బలతో ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు.

అవసరమైతే నిందితులకు లాకప్‌లోనే నాలుగు తగిలించడం పోలీసులకు అలవాటే. అయితే ఈ ప్రత్యేక కౌన్సెలింగ్  చూసే జనానికి కాస్త కొత్త అనిపించింది. ఎందుకంటే ఇది పోలీసులకు అలవాటైన పనైనా  రోడ్డు మీద  చేయడం కదా! ఇంతకీ ఈ కౌన్సెలింగ్‌ చేయించుకున్న నలుగురిలో శేఖర్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. శేఖర్ తన స్నేహితులతో కలసి ఓ వ్యక్తిని హత్య చేశాడు. శేఖర్‌ హత్య చేసింది ఎవరినో కాదు. స్వయానా పిల్లనిచ్చిన మామనే. పిల్లనిచ్చిన అనడం సరికాదేమో. ఎందుకంటే శేఖర్‌ది ప్రేమ వివాహం.  కొంతకాలం వైవాహిక జీవితాన్ని బాగానే అనుభవించాడు. ఆ తర్వాత అసలు గొడవలు మొదలయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో విభేదాలు పొడచూపాయి. దీంతో శేఖర్‌ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో శేఖర్‌లో అసహనం పెరిగింది. ఆమె ఇంటికి వెళ్లాడు. తనతో రమ్మని అడిగాడు. ఆమె కుదరదని చెప్పింది. ఆమె తండ్రి తాపీ మేస్త్రీ అయిన మల్లన్నతో శేఖర్‌ గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య  గొడవ తీవ్రంగానే జరిగింది.

దీంతో శేఖర్‌ మల్లన్నపై కోపం పెంచుకున్నాడు.ఎలాగైనా మల్లన్నను మట్టుబెట్టాలనుకున్నాడు. తన ముగ్గురు స్నేహితులతో కలసి మల్లన్న హత్యకు పక్కా ప్రణాళిక సిద్దం చేశాడు. గురువారం రాత్రి పని ముగించుకుని మల్లన్న ఇంటికి వెళ్తున్నాడు. ఇది ముందే ఊహించిన శేఖర్‌ అతని స్నేహితులు కాపు కాశారు. మాటు వేసి వేటకొడవళ్లతో మల్లన్నను అత్యంత కిరాతకంగా నరికి చంపారు.  దారుణంగా హత్య చేసిన తర్వాత శేఖర్‌ తన మిత్రులతో కలిసి పారిపోయాడు.

విషయం తెలియడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేగంగా దర్యాప్తు  జరిపారు. కేవలం రెండు రోజుల్లోనే శేఖర్‌, అతని స్నేహితులను పట్టుకున్నారు. హత్య చేసింది వారేనని నిర్ధారణ అయింది. అయితే ఈ సారి పోలీసులు కొంచెం కొత్తగా ఆలోచించారు. ఎప్పుడూ వారు లాకప్‌లో చేసే దాన్ని రోడ్డు మీదే చేయాలనుకున్నారు.  శేఖర్‌, అతని స్నేహితులను రోడ్డుపైనే కుళ్లబొడిచారు. గుంతకల్లు డీఎస్పీ సుప్రజ లాఠీ అందుకుని శేఖర్‌ వీపు విమానం మోత మోగించారు.

పోలీసులు నిందితులకు ఇచ్చిన ఈ కౌన్సెలింగ్‌ను చాలా మంది ప్రజలు సమర్థించారు. నిందితులను ఖాకీలు కుల్లబొడుస్తుంటే,  కొందరు యువకులు పోలీలు జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. కారాగారంలో ఎన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించినా ఇటువంటి హంతకుల మనస్తత్వం మారదని జనం చెప్పారు. ఇలాంటి బహిరంగ శిక్షలతోనే హంతకుల్లో తప్పుచేశామనే భావన కలుగుతుందన్నారు. మరెప్పుడూ తప్పుచేయకూడదనే భయం కూడా మనసులో నిలిచిపోతుందన్నారు.

ఇదిలా ఉంటే ఖాకీల చర్య సమర్థనీయం కాదని కొందరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని విమర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement